పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ రోజులలో ఏకాగ్రత వివాహమువలె కాక మా వివాహం తంతు నాల్గురోజులు నడిచింది. రెండవ రోజున శేషహోమ మయినది. శేషహోమ మయిన వెనుక నాలుగవనాడు నాకబలి జరిగింది.

   అక్కడనుంచి మా బావగారింటికి గృహ ప్రవేశానికి వచ్చాము. ఆ మరునాటి ఉదయం నన్ను అలంకరిస్తున్నారు మా పెద్ద వదినెగారు. అప్పుడు బావ లోపలికివచ్చి, "హేమా, ఒక్కసారి ఇల్లారా" అని పిలిచారు. నేను వెంటనే లేచి "ఎందుకూ" అని మా బావ దగ్గరకు వచ్చాను. బావ నన్ను పిలిస్తే, ఏవో దివ్యరాజ్యాలన్నీ నాకు అందినట్లే అవుతుంది.
   "అబ్బా! సిగ్గన్నాలేదు అత్తయ్యకు" అంది శారద, పకపక నవ్వుతూ. నేను బావ వెనకాలే వెళ్ళాను. బావ నన్ను తన శిల్పమందిరము లోనికి తీసుకొనిపోయారు. అక్కడ మేమిద్దరమూ బుద్దభగవానునకు ప్రణుతు లర్పించాము. నా చేయి పట్టుకొని బావ నన్ను ఆ విగ్రహం వెనకాలఉన్న గుమ్మం దగ్గరకు తీసుకువెళ్ళినారు. ఆ తెర ఒత్తిగించి తాళంతీసి తలుపులు తెరచి, లోపలికి నా నడుముచుట్టూ చేయివేసి తీసుకువెళ్ళినారు.
   ఎదురుగా ఒక లోహపద్మాసనముమీద పంచలోహమూర్తులు రెండు ఉన్నాయి. ఆ విగ్రహాలు రెండూ ఓకే పోలిక. కొంచెం తేడా ఉందేమో! ఒక విగ్రహం నా మూర్తే! రెండవ విగ్రహము మా అక్క ప్రతిమ! ఆ విగ్రహాలముందు పూజా పరికరాలన్నీ ఉన్నాయి. అతడా విగ్రహాల ఎదుట మోకరిస్తే నేనూ మోకరించాను. సువాసన దూపాలతో, వెండి పూవులతో అమరింపబడిన విధ్యుద్దీపాలతో ఆ మందిరము దేవలోకంలోని మందిరంలా ఉంది.
   "హేమా! శకుంతలా నువ్వూ నా ఆశయమూర్తులు. శకుంతల నీలో సంపూర్ణ రూపంతో వుంది. మీ యిద్దరూ ఒకటే! నా సర్వస్వం ఏ అణువూ మినహాయింపుకాక నీకు ఇదివరకే అర్పించుకొన్నా! శకుంతలా పూజ, నీ పూజ దినదినమూ చేస్తూనే ఉంటున్నాను. నా సర్వేశ్వరీ, నా కళామూర్తీ! నీతో నేను మానవాభ్యుదయంకోసం మన ప్రేమను అంకితం ఇస్తున్నాను. ఇప్పుడే ఆ అంకితం" అంటూ ఆ రెండు విగ్రహాలకూ షోడశోపచార పూజ తన భార్యనైన నాతోకలిసి అర్పించారు.
   పూజ అయిన తర్వాత మేము ఇద్దరం బావ శిల్పగృహంలోకి వెళ్ళి కూర్చున్నాము. మా బావ నె కూర్చున్న సోఫా దగ్గర క్రిందగా కూర్చుని ఒళ్ళో తలపెట్టి నా నడుంచుట్టూ చేయి వేసి, "హేమా! నా ప్రేమ లోకాలూ, విశ్వాలూ ఆవరించే వెలుగువు. ఆ వెలుగు మద్యంలోనూ నువ్వే, ఆ వెలుగుకు మూలంగానూ నీవే అయివున్నావు. హేమా! నువ్వే శకుంతలవు. నీలో శకుంతల లీనమైపోయింది. నన్ను ప్రేమించవేమో అని ఒక్కొక్కసారి మానమాత్రున్నవడంచేత అధైర్యం కలిగి సప్తపాతాళాలకీ కుంగిపోయేవాడిని. ఒక్కమాటలోగాని, చూపులోగాని నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియకుండా సంచరిస్తూ,