పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిను ప్రతినిమేషమూ, ప్రేమిస్తూఉంటిని. నా శిల్పదేవీ; నా కళాపద్మాసనాధిష్టానమూర్తీ! ఈనాటికి కదా నీ యీ భక్తుని అనుగ్రహించావు" అన్నాడు. మా బావ కళ్ళవెంట ఆనందమే భాష్పాలై ప్రవహించింది.

   "బావా! నువ్వు నన్నెంత మహోత్క్రుష్టంగా ప్రేమిస్తున్నావో, అంత మహోత్తమంగా నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టినప్పటినుంచీ మా అక్కలాగే నిన్ను మాత్రమే ప్రేమించాను కాబోలు. అది ఇప్పుడు నాకు అతిస్పష్టమై, ప్రత్యక్షమైంది" అని నేను సోఫానుంచి దిగజారి మా బావ ఒళ్ళోకి వాలాను.
   వెన్నెల ప్రవాహాలు, వెన్నెల తరంగాలు, వెన్నెల మున్నీర్లు, వెన్నెల గంభీరాలు విరిగిపడే నీలాలరేఖలు, ఒడుసుకుపోయే నీలాల దూరాలు. ఆ రాత్రి మేడమీద నేనూ, నా బావా! నా బావను యెంత గాఢంగా చూడగలను? నా బావను యెంత దగ్గరగా అదుముకోగలను? యిద్దరం మా గదిముందు వరండాలో వెన్నెల్లో నుంచున్నాము. మేమిద్దరమూ ఆ వెన్నెల అంతా ఒక్కటిగా చేరిన ఒక్క దివ్యకిరణమైపోయాము.
   

"ఓం అసతో మా సద్గమయ,

తమసో మా జ్యోతిర్గమయ,

మృత్యో ర్మా అమృతం గమయ."


సంపూర్ణము