పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ యుగాల బాధ తమలో ఇముడ్చుకొని చిరునవ్వుతో తాను నడుస్తూ తన బిడ్డలా నడిపిస్తూ తూలుతూ కుంగుతూ వేయిరెట్లు బలంతో తిరిగిలేస్తూ, నిజాతీయుల దాడుల భరిస్తూ, సర్వకష్టాలు ఆనందంతో గ్రహిస్తూ, నూతన పుత్రకుల హృదయాల కదుముకుంటూ, లోకానికెప్పుడూ దివ్యసంగీతము వినిపిస్తూ ప్రయాణించే భారతధాత్రివంటి మహా ఇల్లాలు ఆ తల్లి. ఆ తల్లి కన్నీటినవ్వుతో, వణుకుతూ మా ఇద్దర్నీ లేవదీసి మాటలులేని దివ్యమంత్రాల మమ్ము ఆశీర్వదించిన తన హృదయానికి మమ్మిద్దరనూ అదుముకొంది.

                                                                                                     *    *    *
   మా బావ తలపెట్టిన స్త్రీ లలిత కళాశాలలో సంగీత పీఠము, సాహిత్యపీఠము, శిల్పపీఠము, నాట్యపీఠము భవననిర్మాణ పీఠము, లోకజ్ఞానపీఠము, కళాస్వరూప వృత్తివిద్యా పీఠము అని ఎనిమిది శాఖ లుంటాయట. లోకజ్ఞానపీఠంలో ప్రాధమిక, మాధ్యమిక, ఉత్తమ విద్యాభాగాలు మూడుంటాయి. భూగోళశాస్త్రము, ప్రజాశాస్త్రము, రాజకీయ, ఆర్ధిక, పదార్ధ, విజ్ఞాన, రసాయనిక, పారిశ్రామిక శాస్త్రాలు, వైద్యారోగ్య శాస్త్రాలు, చరిత్ర, వ్యవసాయ శాస్త్రము మొదలగునవి ఉంటాయట. కళాస్వరూప వృత్తివిద్యాశాఖలో__లక్కబొమ్మలు, కర్ర బొమలు, పింగాణీలు, తివాసీనేతలు, శాలువకుట్టు, శిల్పచర్మకారకత్వము అద్దకము, పేకబెత్తపు అల్లిక, కర్ర సామాను, కంచు మొదలయిన లోహాలతో శిల్పవస్తువుల తయారు, పుస్తకముల కుట్టు, బైండింగు, చేతి కాగితముల తయారు, ఫోటో అచ్చుల తయారు మొదలయిన పనులన్నీ నేర్పుతారట.
   అందరూ ఖడ్డారు వడకాలట, ఖద్దరు కట్టాలట. ఇంక కళల విషయం చెప్పనవసరమే లేదుకదా. ఇది మహాప్రయత్నము. మా బావ ఎల్లా విజయం పొందుతాడో! నాకు మా తల్లిదండ్రులు నా వివాహంనాడు ఇవ్వదలచుకొన్న ముప్పయి ఎకరాల మాగాణి భూమీ, ఇతర దానాలు అన్నీ మా అక్క కళాశాలకు ఇవ్వాలని ఆ రాత్రే సంకల్పించుకొన్నాను. ఈ విషయం రాత్రి బావా, నేనూ మేడమీద మాట్లాడుకొన్నప్పుడు చెప్పాను. మా బావా దిగ్గున లేచి నా చేతులు రెండూ పట్టుకొని, "నువ్వు శకుంతల చెల్లెలివీ, శకుంతలవూ, నా హేమావూను!" అన్నాడు.
   ఆ రాత్రి మా బావను నిద్రపోనీయలేదు. నేను నిద్రపోలేదు. నాకు తక్కిన ప్రపంచమంతా లేనేలేదు. నాకు చంద్రుడు లేడు. వెన్నెలలేదు. నాకు నా బావ త్యాగతి మాత్రం ఎదుట, నా అదృష్టాన్ని నేను నమ్మలేక పోయాను. ఈ ఉత్తమ పురుషుడు నాకు భర్తా? నాది ఎంత ఉత్కృష్ట జన్మ. ఐరోపియను పరపీడనం నాశనమవడం తధ్యం; జగత్తులో త్వరలో ధర్మం నెలకొలుపబడి తీరుతుంది అనుకున్నాను.