పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాదాశీర్వచనం


నా బావ నన్ను ముద్దుపెట్టుకున్నాడు: నన్ను హృదయానికదుముకున్నాడు; నా కళ్ళు రెప్పలు చుంబించినాడు. అలాగే పదినిమిషాలు మే మిరువురమూ చైతన్య రహితులమై వున్నాము. అతడు లేచి, నన్ను లేవదీసినాడు. నా బావ నాకు వరమిచ్చిన ముద్దులు బంగారుపళ్ళేన అమరించిన ఎఱ్ఱని కాబూలి దానిమ్మ గింజలులా ఉన్నాయి. నాలో అమృతప్రవాహాలు ప్రవహింపచేసి నాకు దివ్యత్వమిచ్చి నన్ను లోకాలోకాలు ఆవరింపచేసినవి. నాకు పరవశత్వము కలిగి, నా చెలికానిముందు, నాభర్తకడ నా స్వామి యెదుట, నా ఆత్మేశ్వరుని పాదాలపై సాష్టాంగమయ్యాను. అతడు నన్ను చేతులుపట్టి పైకెత్తి మరలమరల నా నేత్రాలు, నా కంఠము, నా నుదురు, నా చెవులు, నా పెదవులు, నా చుబుకము, చెంపలు ముద్దులిడగా మేము ఇద్దరం మా అక్క సమాధి దేవాలయానికి సాష్టాంగ పడినాము.

   వెనక్కు తిరిగి ఆ వెన్నెల్లో నా బావా, నేనూ తిరిగి మా ఇంటికి వస్తున్నాము. మాలో మాటలులేవు. మాకు సంభాషణ స్పురింపదు. మా చుట్టూ కోకిల 'కో' అన్నది ఒకవేపు, ఒక ప్రక్క ఈలకోడి కూసింది. వేరే ఎడ దూరంగా పొలాల్లో మనుష్యుల పాటలు, దూరాన యూరోపులో, ఆఫ్రికాలో, శాంత అట్లాంటిక్ మహాసముద్రాలలో దారుణ సంగ్రామ ధ్వనులు. దగ్గర నా దేశంలో స్వాతంత్ర్యములేని ఆర్తనాదం, కమ్ముకు వచ్చే కాటకఘోషా, చీనాలో నిశ్శబ్దంగా రాక్షసత్వాన్ని ఎదిరిస్తూ, భయంకర యుద్దాలు చేస్తూ, ఆ రాక్షసత్వానికి ఆహుతి అవుతూ చీనా జాతీయత.

మేము ప్రేమమూర్తులమై ఇంటికి చేరాము. ఇంటిల్లిపాదీ మేము ఒక్క మానవ వ్యక్తిగా ఒకరిలో ఒకరమై నడచి రావడం చూచారు కాబోలు మాపై ఆనంద వీక్షణాలు పన్నీటి జల్లులా కురిసినవి. తిన్నగా మేము లోపలికి పోయి, ఇతరులు చూస్తున్నారన్న భయంలేక, మా రంగ నాయకమ్మత్త ఎదుట మోకరించి మా తలలు ఆమె పాదాల మీద ఆన్చినాము.