పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉన్నవారికై పిలువు! సగం మెలకువవచ్చి కలలుకంటున్న వారికై పిలుపు! మెలకువ వచ్చిన వారికి పిలుపు! నాకు మెలకువా వచ్చింది. హేమా, అంటూ మా బావ నా వైపు తిరిగి పిలుస్తున్నాడు. అతని మాటలలో ఏదో భయం, ఏదో ఆవేదన వ్యక్తం అవుతున్నది.

   "ఆ! అంటూ అతనివైపు తిరిగాను.
   బావ : హమా, ఎందుకు వచ్చావు? నేను నీ జీవితాన్ని చెరుపు చొచ్చిన మదపుటేనుగులా కదల్చిపారవేశాను.
   నేను : బావా, నీ కోసం వచ్చాను. అతిచిన్నతనపు క్షుద్రత్వంతో నా హృదయం నేను తెలుసుకోలేక పారిపోయాను.
   బావ : దానికేమి హేమా, ఎవరి ఆత్మను వారే దర్శించుకోవాలి. కానీ నా దుష్టత్వం నిన్నింతవరకూ వెంటాడించింది. నీ జీవితం నీది, నీ ప్రేమ నీది అని తెలిసి ఉండీ, నిను వాంచించి కృత్రిమవేషంతో, దురాశయంతో నీ జీవితం భగ్నం చేయడానికి మదరాసు వచ్చాను.
   బావ మాటలు నాకు శూలాలైనవి. గుండెరక్తసిక్తమై పోయింది. అతని భుజాలు రెండూ పట్టుకుని కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా, అతని కళ్ళల్లోకి చూస్తూ నా పెదవులు వణుకుతూ ఉండగా, "బావా, నా అక్క సమాధి సాక్షిగా చెబుతున్నాను. నేను నా దేహాన్ని అణుమాత్రం పంకిలం చేసుకోలేదు. నా మనస్సులో అలా రైలులో వెళ్ళేటప్పుడు నీ మీద నిష్కారణమైన కోపం ఒక్కటే ఉంది. ఇంకేమీ లేదు బావా. నా జీవితం అంతా నీమీదే ప్రేమే నిండి ఉంది. అందుకనే నేను నాకు తెలియకుండా నువ్వు వచ్చేటంత వరకూ ఎదురుచూస్తూ మదరాసులో ఉన్నాను కాబోలు. ఈ  ప్రేమ పుట్టినప్పటినుంచీ ఉండి వుండాలి. ఈనాడు, నా శిశుత్వం రోజులు, బాలికా దినాలు జ్ఞప్తికి వస్తున్నాయి. అంత చిన్నతనంలోనూ మా ఆక్క ప్రేమలోనూ, నీ ప్రేమలోనూ నేను జీవించాను. అంతే! నిన్ను వదలి ఉండలేను. నేను అర్హురాలను అని తోస్తే నన్ను నీ హృదయంలోనికి తీసుకో. లేదా, నా జన్మ అంతా సన్యాసమే! దూరాన్నుండి నిన్నే పూజించుకుంటూ  __ భగవంతుడు నా కిచ్చిన శక్తితో మానవ నారాయణ సేవచేస్తూ కాలం గడుపుతాను" అని గద్గదస్వరంతో పలికాను.
   మా బావ నాకేసి ఆ వెన్నెలలో తేరిపార ఒక నిమేష మాత్రం చూచినాడు. మరునిమేషం నా బావ నన్ను తన హృదయాని కదుముకుని గాఢంగా కౌగిలించాడు. నా మోమెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ నా కన్నీళ్ళు తన కండువాతో తుడుస్తూ "హేమం!క్షమించు" అని నా పెదవులు ముద్దు పెట్టుకున్నాడు.