పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బావ మేనమామ కొడుకు సుబ్రహ్మణ్యమూ, అతని భార్యా వచ్చారట. మా బావగారి ఇద్దరు అప్పగార్లూ, బిడ్డలూ ఇంటినిండాకళకళ లాడుతూ ఉన్నారు. యిల్లంతా పెళ్ళివా రిల్లులా ఉంది.

   నేనూ, రంగనాయకమ్మత్తయ్యా కారు దిగగానే వెంకటరంగమ్మ వదినగారూ, అలివేలూ వదినగారూ "అమ్మ వచ్చిం" దంటూ పరుగుల్లో వచ్చారు. నన్ను చూచి "శకుంతలా! అని తెల్లపోయారు. రంగనాయకమ్మత్తయ్య "శకుంతల చెల్లెలు హేమను ఎరుగరటర్రా!" అన్నారు. వాళ్ళిద్దరూ నన్ను కౌగలించుకొని ఎన్నో ప్రశ్నల వర్షాలు కురిపించారు. "ఎప్పుడో చిన్నతనంలో చూచాను. అచ్చంగా శకుంతలే! అమ్మా! నువ్వూ తమ్ముడూ చెన్నపట్నంలో కాపురం పెట్టిన తర్వాత, ఒక్కసారైనా మమ్మల్నక్కడకు తీసికెడ్తేనా?" అంటూ  వాళ్ళిద్దరూ ఏవేవో అన్నారు. పిల్లలందరూ "అమ్మమ్మా!" అంటూ మా రంగనాయకమ్మత్తమీదకు ఎగబడ్డారు. ఆవిడ తెనాలిలో కొని తెప్పించిన పూలు, మిఠాయి పొట్లాలూ, నేను తెప్పించిన బిస్కట్టు డబ్బాలూ, బొమ్మలూ, పిప్పరుమెంటు బిళ్ళల డబ్బాలు పిల్లలందరికీ పంచి యిచ్చారు.
   "అమ్మా, హేమా వచ్చారని తమున్ని తీసుకురారా సుబ్బులూ!" అని అలివేలు వదినగారూ సుబ్రహ్మణ్యంగారితో చెప్పి పంపిస్తోంది. ఆ మాటలు వింటూ ఏదో భయంతో వణికిపోయాను.
   రంగనాయకమ్మత్తగారు "హేమకు మేడమీద గది ఒకటి ఇవ్వండర్రా!" అంది. అలివేలు వదినగారు "సుబ్బులూ నీ గది పక్కగదిలో హేమ సామాను పెట్టించరా" అని చెప్పింది.
   న అసామాను మేడమీదికి తీసుకుపోయి మేడమీద గదిలో పెట్టారు. అక్కడా జిడ్డుదీపం వెలుగుతోంది. నేను ఒక్కదాన్నీ ఆ గదిలో ఎలా ఉంటాను గనుక. శారద అనే మా బావ రెండో మేనకోడలికీ, నాకూ ఆ గది ఏర్పాటయింది. శారదకు ఇరవై ఏళ్లు ఉంటాయి. నాకన్నా ఏడాది పెద్దదనుకుంటాను. ఇంతవరకు పిల్లలెవరూ లేరు. అనేకమంది దేవుళ్లకు మొక్కుతున్నారు. పూజలు, వ్రతాలు, జపాలు చేయిస్తున్నారట. కానీ ఏమీ లాభంలేకపోయింది. ఆ అమ్మాయి నన్ను వింత మృగాన్ని చూచినట్లు చూచింది. నా చీరకట్టే విధానాలూ, నేను తల దువ్వుకొనే విధానమూ, అన్నీ కొత్తగానే ఉన్నాయి ఆమెకు. ఆ అమ్మాయి అక్కగారు సరోజినికి ఇరవై మూడు ఏళ్లు ఉంటాయి. నలుగురు బిడ్డల తల్లి. 
   ఇంతట్లో మా బావను తీసుకొని సుబ్రహ్మణ్యంగారు చక్కా వచ్చారు. నేను హాలులో కుర్చీమీద కూర్చుని ఏదో పుస్తకం చదువు కుంటున్నానన్న మాటేగాని, మనస్సు దానిమీద లేనేలేదు. బావ రాగానే, "హేమా! ఎప్పుడు వచ్చావు? అమ్మా, నువ్వూనా? పొద్దునే బయలుదేరి వచ్చారా?" అని అడిగాడు. నాకు మాట రాలేదు. ఊరికే తల ఊపుతూ నిలుచున్నాను.