పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ఆఁ ! ఆఁ! అంతటితో ఆపు. సరే బావనే చేసుకో తల్లీ! నేను వద్దంటానా." అన్నారాయన. ఆయన హృదయం ఆనందంతో పొంగిపోయింది. పైకి ఏమీ తేల్చని ముఖంపెట్టి "ఆత డేమంటాడో?" అన్నారు.

   "ఏమంటాడూ..."
   "అదేమిటో 'డూడీ, అని అంటావు అతన్ని!"
   "పెళ్ళయిన దాకా నా యిష్టం? నేను ఎల్లుండి ఉదయమే అత్తగారిని తీసుకొని కొల్లిపర వెడ్తాను. ఉదయం పూర్ణిమయినా నా నక్షత్రం పునర్వసుకు స్వాతి పరమ మైత్ర తార! బావే ఒకనాడు నాతో జ్యోతిష్యాన్ని గూర్చి మాట్లాడుతూ ప్రేమయాత్రికులకు పూర్ణిమ ఉత్తమోత్తమ దినమన్నాడు."

 భరత వాక్యం
   
1
మంగళ గీతం

నేనూ మా రంగనాయకమ్మ అత్తగారూ గ్రాండు ట్రంకు ఎక్స్ ప్రెస్ లో ఆడవాళ్ళ రెండవ తరగతి ఎక్కాము. దారిలో కాలం వెళ్ళబుచ్చడానికి అనేక ఇంగ్లీషు నవలలు, ఇంగ్లీషు మాసపత్రికలు కొన్నాను. మా అత్తయ్యగారు చదువుకునేందుకు కొన్ని వేదాంత గ్రంధాలు తెచ్చుకున్నారు. తెల్లవారగట్లనే వంటయిపోవడంవల్ల మేము భోజనం చేసి రైలెక్కినాము. మధ్యాహ్నానానికి టిఫిన్ కారియరునిండా మా అమ్మ ఏవో పెట్టించింది. రైలు కాఫీహోటలు కూడా ఉండనే ఉంటుందాయను.

   సాయంకాలం నాలుగున్నరకు తెనాలి చేరుకునేసరికి పదిరోజులు పట్టినట్లే ఉంది నాకు. ప్రేమ అంటే ఇట్లాగే ఉంటుంది కాబోలు! మా బావ నాకు కనబడతాడా? మా బావ నన్ను చూస్తాడా? మా బావ, అయిదడుగుల తొమ్మిదంగుళాల మనిషి. యోగమూ, ఆరోగ్యమూ, ఉత్తమ జ్ఞానమూ అతని విశాలఫాలంలో, వెడదరొమ్ములో, ఏనుగు కుంభ స్థలాల లాంటి భుజస్కంధంలో, కండలుకట్టి, నునుపులుతేరి, అతని అందమైన చేతుల్లో పొడుగాటి వేళ్ళల్లో గోమూర్ధకటిలో చంద్రబింబంలోని వెన్నెలలా, బంగారంలోని కాంతిలా, తామరపూవులోని మసృణత్వంలా, మరువపు మొక్కల పరిమళంలా చుట్టూ ప్రసరిస్తూ ఉంటాయి. ఎంత తీయని, గంభీరమైన మంద్రపు కంఠ మాతనిది.
   అతని ప్రేమ గంగాఝరి కాగలదు. అతని ప్రణయము నిశ్చలతచే లోనికి చొచ్చుకొని వెళ్ళే హిమాలయ శిఖరంలా స్వచ్చమై, దివ్యోన్నత రూపమై, నిత్యమై ఉండగలదు. అతని కామం కాళిదాసకవితవలె దివ్యా