పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇప్పటికి నేను నా బావను ప్రేమిస్తున్నాను అనే విషయం నిశ్చయం అయింది. నా బావ నన్ను ప్రేమించలేకపోతే నా ప్రాణాలు మరుసటి ముహూర్తంలో పోవడం నిశ్చయం. నా బాల్య క్రీడా కాలం దాటింది. నేనిపుడు సంపూర్ణ స్త్రీని, ప్రేమపుంజాన్ని. నా ప్రేమచే జగమెల్ల పులకింతు అని కాకలీస్వనాలతో మాటాడుతూ తోటంతా మతిలేని దానిలా హేమసుందరి తిరిగింది. తన బావ తన స్వామిగాకుండా ఎలా మనగలదు? తన బావ తనలో తన అక్కను చూచాడు. మా అక్క మాటియ్యండి, నేనే హేమను, హేమే నేను!" అని అన్నట్లు తన బావకు తట్టినట్లు రాశాడు కూడా! ఏదో పరమ రహస్యం ఈ ప్రేమలో ఉన్నది. తాను చేసిన తెలివి తక్కువ పనివల్ల బావకు కోపం వచ్చి వెళ్ళిపోయాడా? తన శీలం శంకించాడా? ఈ రహస్యమూ తాను తేల్చుకుంటుంది. అయితే బావ ప్రేమను సాధించడం? ఆ ప్రేమబలంలో తానూ తన బావా ఈ లోక కళ్యాణం కోసం తమ సర్వస్వమూ అర్పించి దేశసేవ, మానవ సేవ చేస్తారు గాక. తానూ మహాత్మాగాంధీగారి కడకు పోయి, దేశ సేవ రహస్యం తెలుపుకుంటుంది. తాను సమస్త దేశాలూ పోయి నిజమైన ప్రజాపాలన, నిజమైన ఆర్ధిక సమత్వ రహస్యాలు నేర్చుకుంటుంది. ఈ రెండు పవిత్ర ధర్మాలు ఎక్కడా ప్రయాగ అవుతాయో ప్రయాణించి పరిశోధించి ఆ ప్రదేశం తెలుసుకుంటుంది. స్త్రీల హక్కులూ, స్త్రీ ధర్మాలూ, బాధ్యతలూ సంపూర్ణంగా దేశానికి తగినట్లు నిర్ణయించుకొని తన స్నేహితురాండ్రతో కలిసి తా నా పనినే తపస్సు చేసుకుంటుంది.


ఈ లోగా తన బావ దగ్గరకు తానే వెడుతుంది. పూర్వకాలపు నాయికలా తాను నాయకుడి కోసం ఎదురు చూస్తూ, కుళ్ళిపోతూ విరహతాపం పడుతూ ఉండదలచుకోలేదు. హేమకు ఏదో ఆనందం కలిగింది. ఆ తోటలో ఉన్న పూలచెట్లపై వంగి ఆ పరిమళాలన్నీ ఆఘ్రాణించింది. తలెత్తీ.

                                                         "ప్రేమదేవుడ వీవు చంద్రా
                                                          కామదేవుని మేనమామవు!
                                                          చంద్రికకు ఆత్మేశ్వరుడవు
                                                          నేను చంద్రిక వీవు చంద్రుడు"
   అని పాడుకుని ఆ వెన్నెలను పెదవులతో చుంబించి లోనికి పరుగెత్తింది. తండ్రిగారి దగ్గరకు పోయి, ఆయన మోమును తన రెండు హస్తాలతో పుణికి, చెంపలు పట్టి మోము తనవైపు తిపుకొని "నాన్నగారూ..." అని పిలిచింది.
   "ఏమిటి తల్లీ?" అని ఆయన ప్రశ్నించారు.
   "నాన్నగారూ! నేను బావను తప్ప ఎవ్వరినీ పెళ్ళిచేసుకోదలచుకొలేదు. బావ నన్ను చేసుకోకపోతే..."