పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాణమూర్తి సూర్యుడు. సూర్యకళ అతని బిడ్డ. కాంతిరహితుడై స్థాణువైన చంద్రుని బ్రతుకులో ఆ బాల అతని ప్రియురాలైలయిస్తుంధి. అప్పుడు వారిరువురి సంగమానందంలోంచి అతడు సుధామూర్తిగా, ఆమె చంద్రికగా ప్రత్యక్షం అవుతారు...ఈ నిత్యశృంగారకావ్యము ప్రతినెలా విశ్వానందంకోసం ప్రదర్శింపబడుతోంది. ఈ నాయికా నాయకుల స్థాయీ భావంలోంచి, లోకానందమూర్తులు శశికళలు ఉద్భవించి భూమిలోని ప్రేమికులను కలతపెట్టి ప్రేమ తపోదీక్ష వారికి వరమిస్తారు. ఆ దీక్షలో జగజ్జీవుల వ్రున్గార నాటకాలు ప్రారంభం.

   ఈ శృంగారాలకు ఉపాంగాలు మానవుల ఇతర ప్రయత్నాలు. ఒక జీవి బ్రతుకుకు ఆశించడం ఆ జీవి ముఖ్యదీక్ష. కానీ అది స్వలాభ స్వరూపమే అవుతుంది. ఆ బ్రతుకుకోసం....ఆహారం, నిద్ర రక్షణలు. అవే ఆర్ధిక, రాజకీయ పారిశ్రామిక సమస్యలయ్యాయి. ఇవి ప్రతీజీవికీ వ్యక్తిగతమైనవి. ఇన్ని ప్రయత్నాలు చేసి, ఇన్ని కష్టాలకు పాలవుతూ, ఓడిపోతూ, నెగ్గుతూ ప్రయాణం చేసిన జీవికి చివరకు చావు తప్పదు. కాబట్టి ఆర్దికాది సమస్యలు రెండవ రకమే అయ్యాయి. ముఖ్య సమస్య జీవికి శాశ్వతత్వం అనుగ్రహించే మిధునత్వం. సంగమం వల్ల జాతి జీవిస్తుంది. జాత్యభివృద్ధి అమృతత్వం అవుతుంది. అందుకని స్త్రీలకు పురుష వాంఛ పురుషులకు స్త్రీ వాంఛ అనే మిధునభావం....అత్యంత ప్రాముఖ్యమైన సమస్య అయింది. అదే శృంగారం! అందుకై సౌందర్యారాధన లలితకళా రూపం. సౌందర్యార్చన భావం వాణీ బ్రహ్మలు, స్త్రీ పురుష ప్రేమభావం లక్ష్మీనారాయణులు, వారి రతిభావం అర్ధనారీశ్వరులు. అంతతో కుమారాజననం.  అది జాతివృద్దిభావం. ఇంతవరకు శివుడు మృత్యువు మహాకాళుడున్నూ, పార్వతి మహాకాళీ. ఇప్పుడే శివుడు మృత్యుంజయుడు; మహాకాళి అమృతమూర్తిమైన లలిత.
   ఇంతవరకు మధురంగా పొంగిపోతూ హేమ ఆలోచనలు ఉప్పొంగాయి. ఆ బాలిక అప్పుడు ఆ ఆలోచనాభారం భరించలేక ఒక్క గంతున కుర్చీనుంచి లేచి, తోటంతా గబగబా తిరిగింది. తనకు చంద్రస్పర్స ఎక్కువై మతిపోయిందేమో? ఈ పిచ్చి ఆలోచనలు వచ్చాయేమిటి? ఈ ఆలోచన లిట్లా రావడం మూర్తి బావ కళావేదాంత బోధ! ఈలాంటి వెఱ్ఱి వేదాంతాలు నూరిపోసేవాడేమిటీ తనకు? అతడు తనకు చంద్రుడా? తా నాతని చంద్రికా? అయితే అక్క ఎవరు? అక్కా అతనూ ఎంత ప్రేమించుకొనేవారో అతడువ్రాసి తనకిచ్చిన అతనిస్వీయచరిత్రలో స్పష్టం చేశాడు. తన అక్కను అణువణువు అతడు ప్రేమించాడు, పూజించాడు. ఓహో! ఆ ప్రకరణము చదువుతోంటే తాను ఏ లోకాలకో తేలిపోయింది.
   నిజమైన ప్రేమ ఒక్కసారి వస్తుందనుకుంటాను పురుషుని జీవితంలో, స్త్రీ జీవితంలోనూ! అలా కాకపోతే ఏదో జన్మలోన్నా వస్తుంది. అలా వచ్చిన వెనుక మరొక పురుషుడు స్త్రీకిగాని, మరొక స్త్రీ పురుషునికి గాని ప్రేమ నిదానాలు కాజాలదు. ప్రపంచంలో ఒక్కటే యమునాగంగా సంగమం. అది శాశ్వతం కూడా