పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకం : సాయంకాలం అతడు నేను జనరల్ ఆస్పత్రిలో ఉండగానే వచ్చాడు. భార్యను జూచి జరిగిందంతా చెప్పాడు. హేమ మహోత్తమ బాలిక అని కళ్ళనీళ్ళు కారిపోతుండగా భార్యతో గోలపెట్టాడు. ఆ అమ్మాయి తేరుకుంది. కాల్పులు త్వరలోనే మాన్తాయనీ, ఆవిడకు షాక్ తగ్గి సాధారణ స్థితిలోకి వచ్చిందనీ, వారం రోజులలో ఆమె ఇంటికి వెళ్ళవచ్చుననీ డాక్టరుగారు చెప్పారు. అమ్మయ్యా అని వచ్చేశాను.

   సీత : ఒసే లోకం, నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నేను పురుషున్ని మాత్రం వాంఛించా, అతడు ఇల్లా ఉండాలి అల్లా వుండాలి అని కలలుకంటూ ఉండేదాన్ని. ఆ కలలే నాకు ఆనందం ఇచ్చేవి. పురుషున్ని వాంఛిస్తానుగాని హేమా! ఫలానా పురుషుడనిలేదు నాకు. నచ్చిన భర్త వస్తే, అతన్ని ఆనందంలో ముంచగలను, నేను కావలైస్నంత ఆనందం పొందగలను.
   సోఫీ : భేష్! నాకు నువ్వు బాగా నచ్చావే!
   హేమ : ప్రేమ అనే భావం కొంతమందికి ఇష్టం! దానికోసం ప్రాకులాడుతారు. ప్రాణం ధారపోస్తారు. ప్రేమ అనేది విషం! ఎందుకంటే ఎక్కువైతే ప్రాణం తీస్తుంది.
   విషము: అలాగే ప్రేమ ఎక్కువైతే ప్రాణికి విషమే!
   సీత : ఇవాళ హేమ వేదాంతం మాట్లాడుతోందేమిటి?
   సోఫీ : అమ్మాయిగారి హంగామా చూసి, నాయకుడు హడలి బేజారై పారిపోయాడు.
   హేమ : సోఫీ!
   సోఫీ : ఏం నిజం చెబితే నిష్టురమటే! నీలో ఏ మాత్రమన్నా గౌరవం ఉంటే, నీలో త్యాగతి అంటే నిజమైన ప్రేమ ఉంటే, వెళ్ళి అతని కాళ్ళమీద పడు.
   లోకే : ఛీ, నీ మాటలూ నువ్వూనూ! హేమ తెలివితక్కువది కావచ్చుగాని, హీనురాలు మాత్రం కాదు.
   సోఫీ : ఇందులో హీనత్వం మాట ఎక్కడ వచ్చిందే! నేనే హేమనైతే నా ప్రేమే నాకు సర్వస్వమూ! నా జీవితం అంతా ఆ ప్రేమలోనే ఆనందమాయం చేసుకుంటాను. ఆ ఆనందం నాకు బలం కాగా లోకంలో నేను ఆడవలసిన పాత్రధారణచేసి, లోకోద్దరణ మహాసౌధ నిర్మాణం కోసం నా పరికరాలు సిద్దం చేసికొంటాను.
   సీత : నాకు మీరు మాట్లాడేదేమీ అర్ధం కావటంలేదు.
   లోకే : ఒసే సీతా! నీవు గృహిణివి, భార్యవు, ఇల్లాలివీ! నీ భర్త రాక్షసుడు కాకపోతే నీ జీవితం హైరోడ్డులా వెళ్ళిపోతుంది. కానీ అందరు స్త్రీలూ అల్లా ఉంటారంటే!
   సీత : అర్ధం చెప్పవే అంటే కేంబ్రిడ్జి డిక్షనరీ అంతా చదువుతా వేమిటి!
   లోకే : నీ మాట ముందు చూద్దూ. కల్పమూర్తి విషయం నువ్వేమంటావు?