పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గారు, బి.ఏ. పరీక్షకు వెళ్ళిన సీతాకుమారి నేమిటి? స్కూలు ఫైనలు నెగ్గలేని కల్పమూర్తి వివాహం వాంఛించడ మేమిటి? అని ఆశ్చర్యం పొందారనీ.


   సోఫీ : కల్పమూర్తి సుగుణాలప్రోగే. అత్యంత సుందరాకారుడు. నేను హిందూబాలికనైతే అతన్ని ఎగనెత్తుకుపోయి ఉందును.
   లోకే : ఒసే సీతా! కల్పమూర్తి కేమిటే? మొన్న హేమ కల్పమూర్తిని అమెరికాకుపోయి ఏ వ్యవసాయంలోనో, ఏ వ్యాయామంలోనో  ఒక డిగ్రీ వేసుకురావోయి అంది. కల్పమూర్తి ఉబలాటపడ్డాడు. వాళ్ళమ్మ ఒప్పుకుంటేనా? అదీకాక బరోడా మహారాజు అతని టెన్నిస్, క్రికెట్టు ఆటలు చూసి, తన సంస్థానంలో స్కౌటు అసిస్టెంటు కమీషనర్ ఉద్యోగం ఇస్తామని రమ్మన్నారు. అది ఎరగవు కాబోలు. ఆ తర్వాత మొన్న వారి అంతరంగిక కార్యదర్శి కల్పమూర్తికి ఉత్తరం రాశాడు. నేను ఒప్పుకో నాయనా అంటే, త్యాగతి దగ్గరకు సలహాకు పోయాడు. త్యాగతి జాతీయ వాదీ; గర్భగాందేయుడు! అతడు నీకెందుకయ్యా ఉద్యోగం? అన్నాడట. మొగం ఇంత చేసుకొని వచ్చాడు?
   సోఫీ : త్యాగతి ఎప్పుడూ అంతేలెద్దూ. కల్పమూర్తికి ఇష్టం లేని సలహా ఎందుకు?
   సీత : ఎప్పుడూ చదువేనా ఏమిటి? మనిషియొక్క ఉచ్చనీచాలు నిర్ణయించేది?
   సోఫీ : ఓహో! సీతకు కల్పమూర్తి__
   సీత : ఛట్, ఊరుకో సోఫీ,
   లోకే : నీ ఉద్దేశం మా దగ్గిర దాచడమెందుకే? అయినా ఇప్పుడు మించిపొయిందేమిటి? ఆయన బరోడా ఉద్యోగం ఒప్పుకావచ్చును.
   సీత : నిన్న త్యాగతిగారు మా నాన్నగారితో మాట్లాడారట. బరోడా ఉద్యోగం ఒప్పుకోమనే అందరూ నిశ్చయించారట.
   సోఫీ : చాలాబాగుంది. ఇవాళ అన్నీ శుభవార్తలే.
   లోకే : కల్పమూర్తి ప్రియురాలా! సం-కల్పమూర్తి ఇల్లాలా?
   టెన్నిస్ బాటు చేతబట్టి ఠీవిగా పోయేటి, కల్పమూర్తి ప్రియురాలా,
   సం-కల్పమూర్తి ఇల్లాలా!
   తోటంతా గంతువేసి దొడ్డంతా దొర్లివేసి
   మాటలతో భర్తగార్ని మరిపించే మురిపించే
   కల్పమూర్తి ప్రియురాలా! సం-కల్పమూర్తి ఇల్లాలా!
   అందరూ చప్పట్లు కొట్టారు. సీతాకుమారి వచ్చి "ఒన్స్ మోర్" అన్నది.
   సోఫీ : మొగుడిమీద పాట__మళ్ళీ వినాలని కాబోలు 'ఒన్స్ మోర్' అంటోంది.
   హేమ చిరునవ్వు నవ్వుతూ "లోకం! నిశాపతి ఎక్కడ మకాం?" అని అడిగింది. "ఉడ్ లాండ్స్ లో ఉంటాను అని కూడా ఈ టెలిగ్రాం లోనే ఉందే" అని సోఫీ టెలిగ్రాం కాగితం చూస్తూ అన్నది.
   సోఫీ : ఇంతకూ తీర్ధమిత్రుడి పెళ్ళానికి ఎల్లావుందే లోకం?