పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకం : తీర్ధమిత్రుడంటే హేమకు లెక్కలేదు. తానేదో తప్పు చేశానని కుళ్ళిపోతోంది.

   సోఫీ : ఒసే హేమా! నీ ఇల్లు బంగారంకానూ. నువ్వు కుల్లడం ఎందుకు? నువ్వేమన్నా స్త్రీ పురుష సంబంధ విషయంలో తొందరపడ్డావు కనకనా? మీ హిందువుల్లో ఈ రోజున పెళ్ళి కాకుండా ఎదిగున్న పిల్లలుండటం తటస్థించింది. మా ఇంగ్లీషు వాళ్ళలో అనాదినుంచీ గొడవలు ఇవేగా! మా ఆంగ్ల బాలికలు ఎన్ని తప్పులో చేసి దిద్దుకుంటూ ఉంటారు. ఒకప్పుడు దిద్దుకోలేక కుళ్ళిపోతారు. ప్రతిజాతికీ, ప్రతిదేశానీకి ఈ సమస్యలు అనేక రకాలుగా వస్తూనే వుంటాయి. అందుకు నీకీ బెంగెందుకే హేమా?
   లోకం : మనుష్యునీ జీవితం ఆనందమయంగా ఎప్పుడై నా ఒక పది నిమిషాలపాటో, పదిరోజులపాటో వుంటే వుండవచ్చునేమో? ఆ తర్వాత విచారంలో, ఆవేదనలలో పడిపోతాము. వెలుగునీడలే జీవితం కెరటాలూ, లోతులూ?
   హేమ: ఏదో టెలిగ్రాం వచ్చిందేమిటి నీకు?
   లోకం : నిశాపతిగారు రేపు సాయంకాలం గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ కు వస్తారట.    
   హేమ : అప్పుడే నిశాపతి గారయ్యాడూ నీకూ? (చిరునవ్వు నవ్వింది)
   లోకం : (నవ్వుతూ, సిగ్గుపడుతూ) నిశాపతీ అని పిలవనా?
   సోఫీ : మా వాళ్ళలో మొదట మిస్టర్, తర్వాత ఇంటిపేరు మాత్రం తర్వాత అసలు పేరు. పెళ్ళయితే ఒరే! ఒసే!
   హేమ : అదీ ఒక అందమే!
   లోకం : సోఫీ, రేపు హేమ త్యాగతిని బావా అనే పిలుస్తూ ఉంటుంది కాబోలు!
   సోఫీ : ఒరే బావా! అని అంటూ వుంటే బాగా వుంటుంది.
   ఇంతట్లో హేమ స్నేహితురాలూ, యింకా కళాశాలలో చదువుకుంటున్న సీతాకుమారి "తోడి దొంగలందరూ చేరారూ?" అంటూ వచ్చింది.
   సోఫీ : సీతా! బొత్తిగా కనపడ్డం మానేశావేమిటే?
   సీత : పరీక్షల గొడవల్లో పడ్డానా? అవి అయ్యాయి. ఆ తర్వాత, ఒక విషయం కొంచెం మార్కులు తక్కువగా వస్తాయన్న భయంవేసి నాన్నతో చెప్పాను. అందుకు తగిన ఏర్పాట్లు చేశారులే మా నాన్నగారు.
   లోకం : బి.ఏ. పరీక్షలిచ్చి కూడా మార్కుల గొడవేంటే?
   సోఫీ : వీళ్ళంతా మార్క్సిస్టులే లోకం.
   అందరూ పకపక నవ్వారు, హేమ చిరునవ్వు నవ్వింది.
   సీత : ఒసే హేమా! కల్పమూర్తిగారి రాయబారం విషయం విన్నావా?
   లోకం : ఏదో నేను విన్నానే, తమ అందాలరాణిని అతడు గ్రహించాలని తమ తండ్రిగారికి రాయబారం పంపారనీ, తమ తండ్రి అయిన అడ్వకేటు