పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బొటబొట కారాయి. అవి తుడుచుకొంటూంటే మీ నాన్నగారు వచ్చి "అమ్మాయీ వెంకటరత్నం! నువ్వు మా యింటిలో వుండిపో. మా హేమతోపాటే నువ్వు. తల్లీ, నా మాట విను. మీ పిన్నీ, నేనూ ఈ విషయం ఎన్నిసార్లో అనుకున్నాం. మాకు ఒక్క హేమే కదా! మా దేవత శకుంతల వెళ్ళిపోయింది కదా! మేం ఇద్దరం పెద్దవాళ్ళ మవుతున్నాము. మా హేమ ఒంటరి అయిపోయింది కదా! నువ్వు మా అమ్మాయివి కావూ?" అన్నారు. పిన్ని దగ్గరకు బాబాయిగారు తీసుకువెడితే, ఆమె కళ్ళనీళ్ళతో నన్ను బ్రతిమాలింది. హేమా! అప్పుడు నువ్వూ నన్ను ఎంత బ్రతిమాలినావో, నువ్వు మరిచిపోయి ఉంటావు. అంత ఉత్తమ కుటుంబం మీది. ఆనాటినుంచీ మీ అందరి ప్రేమసముద్రాలలో నేను మునిగిపోయాను!" అని లోకేశ్వరి ఊరుకుంది.


హేమ : "లోకం, నువ్వు నా చిన్నక్కవే. నాకు మా అక్కపోయిన లోటు ఏమీలేకుండా నీ ప్రేమతో ముంచావు. డబ్బు ప్రేమను కొనగలదా లోకం! అదృష్టం ఉన్నవారికే అది ప్రాప్తం!"
   హేమ అతిదుఃఖముతో కరిగిపోయింది. లోకేశ్వరి హేమను అతి గాఢంగా తన హృదయానికి అదుముకుంది.
   ఆ సాయంకాలం శ్రీనాధమూర్తి కొల్లిపర వెళ్ళిపోయినాడని రంగనాయకమ్మత్తగారు ఇంటికివచ్చి చెప్పారు. హేమ చల్లగా తోటలోకి జారి ఆ పూలచెట్లమధ్య కూర్చొని కుంగిపోయింది. ఇంతలో లోకేశ్వరి నిశాపతి దగ్గరనుంచి వచ్చిన టెలిగ్రాం అక్కడకు పట్టుకువచ్చింది. సోఫీ తన కారు దిగి "హేమా" అంటూ తోటలోకి పరుగెత్తుకు వచ్చింది.
   
                                                                                                                  39
   సోఫీ హేమ దగ్గరకు పరుగెత్తింది. ఈమధ్య సోఫీ హేమగారింటికి ఎక్కువగా రాలేదు. దానికి కారణం తానీ వేసవికాలం తండ్రిగారితో కలిసి ఇంగ్లండు వెడదామని; ఆ సందర్భంలో యేర్పాట్లు చేయడానికి తానూ తన తండ్రీ ప్రభుత్వాజ్ఞలు మొదలయిన వాటికోసం ఉత్తరాలు వ్రాయడం, దరఖాస్తులు పెట్టటం వగైరాలలో ఉన్నామనీ, అవి వచ్చాయనీ, ఇంతట్లో లోకేశ్వరికి పెళ్ళి అనే సంగతి తెలిసిందనీ, పైగా తాము ఆఫ్రికామీదుగా వెళ్ళవలసివస్తుందని తెలిసిందనీ, అలా వెళ్ళడం కూడా ప్రమాదకరం అని ప్రభుత్వంవారు తెలిపారనీ,ఆ కారణాలచేత ప్రయాణం ఆపేశామనీ; వేసవికాలంలో ఊటీలో గడుపుతామనీ హేమతో చెప్పి హేమను గట్టిగా కౌగలించుకొని, "హేమ్, ఏమిటే అల్లా దిగులుపడి ఉన్నావు?" అని ప్రశ్నించింది.
   హేమ : సోఫీ, నీకన్ని సంగతులు లోకం చెప్తుందిలే!
   లోకేశ్వరి మొదటినుంచి చివరదాకా జరిగిన విషయాలన్నీ చెప్పింది సోఫీకి.
   సోఫీ : నేను తీర్ధమిత్రున్ని ఎప్పుడూ మంచివాడనుకోలేదు. కానీ మన మనస్సు నిర్మలంగా వుంటే వేయి తీర్ధమిత్రుల్లు మన్నేం చేస్తారే?