పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తానూ తీర్ధమిత్రుడూ రైలెక్కగానే, టాక్సీకారు నడిపే డ్రైవరు హేమగారి పెద్దకారు డ్రైవరుతో చెప్పాడనీ, అతడు తన సైకిలుమీద వెంటనే తమ ఇంటికి వచ్చి లోకేశ్వరిని "హేమగారేరీ?" అని అడిగి, ఆమె ఎక్కడికో వెళ్ళిందంటే, టాక్సీడ్రైవరు చెప్పిన కథ లోకేశ్వరితో చెప్పాడనీ, ఆ విషయం పరిశీలన చేయడానికి కంగారుపడుతూ లోకేశ్వరి హేమ గదిలోకి వెడితే, హేమ లోకేశ్వరికి రాసిన ఉత్తరం చూసి, లోకేశ్వరి వెక్కి వెక్కి ఏడ్చిందనీ; తూలుతూ లోకేశ్వరి తన గదిలోకి వెళ్ళి శకుంతల ఫోటో దగ్గర కూలబడి ప్రార్ధించి, తమ కారు వేసుకుని కల్పమూర్తి దగ్గరకుపోయిందనీ; లోకేశ్వరి తన గదిలో ప్రార్ధిస్తున్నప్పుడు డ్రైవరు ఈ విషయం హేమ పరిచారిక వీరమ్మకు చెప్పాడనీ, ఆ తర్వాత వాడు కారుమీద వెంటనే లోకేశ్వరిని తీసుకుపోయాడనీ; వీరమ్మ గోల పెడుతూ, బావురుమంటూ రాజ్యలక్ష్మమ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పిందనీ, దానితో తన తల్లి కెవ్వున కేకవేసి పడిపోయిందనీ; వినాయకరావుగారు గబ గబ వచ్చి, వీరమ్మ చెప్పిన మాటలు విని, ఆయన భార్య అవస్థ చూచి మొండి ధైర్యం తెచ్చుకొని, ఈ విషయం ఎవరితో చెప్పవద్దని వీరంమకు చెప్పి, అలా చెబితే దాని బుర్ర చిదుకకొడ్తానని, వెళ్ళి డాక్టరుకు ఫోను చేశాడనీ; డాక్టరుగారు వచ్చేలోగా ఏవో నీళ్ళు చల్లుతూ కళ్ళనీళ్ళు కారుస్తూ కూర్చున్నారనీ; డాక్టరుగారు వచ్చి వైద్యం ప్రారంభించారనీ; వినాయకరావుగారు తూలిపడిపోబోయి, మొండిధైర్యం తెచ్చికొని, హాలులోనికి వెళ్ళి కుర్చీమీద చదికిలబడ్డారనీ; ఈలోగా డాక్టరుగారూ తా నెరుగున్న మంచి నర్సుకోసం తన కారు పంపించి రప్పించారనీ; ఆ తర్వాత తానూ, త్యాగాతీ వగైరా వచ్చామనీ; జరిగిందంతా లోకేశ్వరి ఆ రాత్రే హేమతో చెప్పింది.

   లోకేశ్వరీ, కల్పమూర్తీ కలిసి త్యాగతి దగ్గిరకు పరుగెత్తారట. త్యాగతి గుంటకల్లులోనో, కడపలోనో హేమను కలిసి వెనక్కు తీసుకు వద్దామని సంకల్పించి కల్పమూర్తి కారును బాగా పెట్రోలు వేసి సిద్దం చేయమనీ; తాను రెండువందల రూపాయలు పట్టుకవచ్చి, కారులో తాను కల్పమూర్తితో వస్తూ డ్రైవరుతో_యిదంతా తన ఏర్పాటేననీ ముందు సోఫీ, తీర్ధమిత్రుడూ, హేమా హంపి వెళ్ళడం, తాము తర్వాత కారుమీద వెళ్ళడం ఏర్పాటు చేశాననీ చెప్పాడట__డ్రైవరూ నమ్మినట్లే కనబడ్డాడట. అయినా తన్ను యింటి దగ్గర జాగ్రత్తగా కనిపెట్టమంటూ దిగబెట్టడానికిన్నీ సోఫీని తీసుకువెళ్ళడానికిన్నీ నిశ్చయించేశాడట త్యాగతి. తామంతా కల్పమూర్తి ఇంటికి వచ్చారట. అక్కడ కల్పమూర్తి తన కారు తీసి వేయి రూపాయలు జేబులో వేసుకొని బయలుదేరాడట. లోకాన్నీ, కారునూ ఇంటిదగ్గర దిగబెట్టడానికి తమ ఇంటికి వచ్చారట. రాగానే హేమను చూచి ఆశ్చర్యం పొందారట. లోకేశ్వరికి కలిగిన ఆనందం వర్ణనాతీతమట. పెద్ద బరువు తీసినట్లయి వెక్కి వెక్కి ఏడ్పు వచ్చిందట లోకేశ్వరికి. లోకేశ్వరి వెంటనే తన గదిలోకి పరువిడి అక్క ఫోటో ఎదుట సాగిలపడి మొక్కుకొని ఆనందంలో కన్నీళ్ళు వెల్లువలయిందట.