పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొక్కును భగవంతుడు మెచ్చుకుంటాడా అన్న భయంతో బిడ్డలచేత మొక్కించాడు. తొమ్మిదేళ్ళ ఆ పెద్దమ్మాయి "పార్ధసారధీ, మా అమ్మను బ్రతికించు. నేను నీకు నా ఉంగరం ఇస్తాను తండ్రీ" అని మొక్కింది.

                                                                                                                   37
   త్యాగతి తిన్నగా కొల్లిపర వెళ్ళి తన ఇంటిలో మకాం పెట్టాడు. అక్కగార్లకు, మేనమామకు రావలసిందనీ కోరుతూ ఉత్తరాలు రాశాడు. ఒక గది శకుంతల పేర ఏర్పరచుకున్నాడు. తను శకుంతల విద్యాలయానికి వేసిన దానం బాగా పెరిగింది! విద్యాలయానికని తాను నిర్దేశించి ఉంచిన తోట కృష్ణ కాలవ పక్కనే ఉన్నది. అక్కడ నూయి తవ్వితే గంగాజలం వంటి నీరు పుడుతుంది. పనివాళ్ళను పిలిపించాడు.
   శ్రీనాథమూర్తి వచ్చాడని, అతని చిన్ననాటి స్నేహితులు చాలామంది చూడడానికి వచ్చారు. సూరపరెడ్డి ఇప్పుడు తెనాలిలో వకీలుగా ఉన్నాడు. వెంకట్రామయ్యాచౌదరి ఎం. బి. బి. యస్. పరీక్షలో విజయం పొంది తెనాలిలోనే వైద్యవృత్తి చేస్తున్నాడు. వాళ్ళతో ఒక రోజల్లా ఆనందంతో గడిపాడు. అతని చిననాటి కథలన్నీ జ్ఞాపకం వచ్చాయి "ఒరే మూర్తీ! రారా తెనాలి. మా ఆవిణ్ణి చూడలేదు నువ్వు, మా పిల్లల్ని చూడలేదు. నువ్వు రాసే కథలు, పాటలు, శిల్పకళను గూర్చిన వ్యాసాలూ పత్రికలలో చూస్తూ, నీ బొమ్మల ప్రతిరూపాలు చూస్తూ, మన చిన్ననాటి ఆటలు తలుచుకుంటూ, మా ఆవిడకు చెపుతూ ఉంటాను. మా ఆవిడ బి.ఏ. ప్యాసయిన ఆవిడే!" అని వెంకట్రామయ్యచౌదరి అన్నాడు.
   సూరపరెడ్డి బలవంతం చేశాడు. వాళ్ళతోపాటు తెనాలి పోయి త్యాగతి మూడురోజు లున్నాడు. రెండురోజులు చౌదరిగారి ఇంట్లో మకాం. ఒకరోజు రెడ్డిగారి ఇంట్లో మకాం. వెంకట్రామయ్యచౌదరీ, ఆయన భార్య సరళాదేవి, సూరపరెడ్డీ, త్యాగాతీ ఒకరోజున చౌదరిగారి ఇంట్లో సాయంకాలం టీకి చేరారు. ఫలహారాదులై త్యాగతీ, చౌదరి సిగరెట్లు వెలిగించారు. రెడ్డి చేబ్రోలు ఆకు చిన్న తోలుసంచిలో పెట్టుకొన్నది తీసి చుట్ట చుట్టూకొని వెలిగించాడు.
   సూర : ఒరే మూర్తీ, ఎన్ని దేశాలు తిరిగావురా? ప్రస్తుతం ఏమి చేయదలచుకొన్నావు?
   త్యాగతి : శకుంతలా లలిత కళాశాల పెట్టించదలచుకొన్నాను. 
   సరళ : ఏమండీ మూర్తిగారూ! మీ ఆవిడ పేరున లలిత కళాశాల పెట్టించడం ఎంతో సంతోషంగా వుందండీ నాకు. మీ ఆవిణ్ణి నేను చూడలేదు. కానీ మీరు వేసిన బొమ్మా, తయారు చేసిన శిల్పము, ఆమె ఫొటో అన్నీ చూస్తే ఆవిడ అత్యద్భుత సుందరీమణి అని నాకు తోచింది.
   వెంక : నీకు తోచడం ఏమిటి! శకుంతల మా చిన్నతనంలో మాతో ఆడుకొనేది. ఆ అమ్మాయి అందాలముద్ద. సుగుణాల ప్రోవు.