పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంటనే పరుగెత్తి, వినాయకరావుగారి ఇంటికి ఫోనుచేస్తే వాళ్ళేవారొ కారుమీద వచ్చారట. ఇంటాయనే జనరల్ ఆస్పత్రివాళ్ళకూ లేడీ డాక్టరుకూ ఫోనుచేస్తే, వాళ్ళు అంబులెన్సుకారు తీసుకువచ్చారట. మీ ఆవిణ్ణి వాళ్ళంతా ఆస్పత్రికి తీసుకుపోయి ప్రవేశపెట్టారట, ఒక కారుమీద శ్రీనివాసరావుగారూవారూ మాకోసం వచ్చి, మమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. ఇప్పుడు నేను ఆస్పత్రికి వెళ్ళి ఎల్లా వుందో కనుక్కువస్తాను. నువ్వు పిల్లల దగ్గర ఉండు. సాయంకాలం నీకిష్టమైతే, డాక్టర్లు ఒప్పుకుంటే వెళ్ళి చూచివద్దువుగాని.

   తీర్ధమిత్రుడు కళ్ళనీళ్ళు కారిపోగా వెక్కి వెక్కి ఏడ్పు ప్రారంభించాడు. తన చేతులారా భార్యను చంపుకున్నాడు. తాను హంతకుడు. ఉరిశిక్షకు పాత్రుడు. తీర్ధమిత్రుని చుట్టం ఎందుకీ దొంగ ఎద్పులూ ఈ బుడి బుడి దుఃఖాలూ అని అసహ్యించుకుంటూ వైద్యాలయానికి వెళ్ళాడు. దారిలో అతనికి తీర్ధమిత్రుని గురించి ఆలోచనలే. ఈలాటి నీరసపు కుంకలకు మాట్లాడితే ఏడుపులు! వాళ్ళ విచారాలు, వాళ్ళ ప్రేమలు నీటిలో రాతలు. మెత్తటి బురద హృదయాలు వీళ్ళవి. పెళ్ళాం చస్తే పెద్ద పెట్టున లోకం దద్దరిల్లేటట్లు ఏడుస్తారు! ఆ మర్నాడో, ఆ మరుసటినాడో ఇంకోపిల్లను పెళ్ళి చేసుకుంటారు. జానకి రామమూర్తి (తీర్ధమిత్రుడు) వంటి వాళ్ళు తెల్ల బొద్దింకలు. ఆ ఆలోచనలవల్ల అతని వళ్ళు జలధరించింది.
   జనరల్ ఆస్పత్రిలో నరసమ్మ (కనకలత) చావుబ్రతుకుల మీద ఉందనీ, నిస్పృహ ఎక్కువవడంవల్ల వచ్చిన హృదయఘాతం (షాక్) తగ్గడంలేదనీ, గ్లూకోజు మొదలైనవి ఎన్ని ఇచ్చినా రోగి కోలుకోవటం లేదని తెలిసింది. అలాంటి బంగారుబొమ్మ ఈలాంటి వెధవకు ఎందుకు దక్కుతుందని అనుకుంటూ ఆ చుట్టం మైలాపూరు వెళ్ళి సమాచారం యావత్తూ లోకేశ్వరితో మాత్రం చెప్పి ట్రిప్లికేను వెళ్ళిపోయాడు.
   తన చుట్టం తన భార్య విషయం ఏమీ దాచకుండా తనతో చెప్పగానే జానకి రామమూర్తికీ ఆవేదన ఎక్కువైంది. ఏమిటి చెయ్యాలి? కోటిమంది దేవుళ్ళకు మొక్కుకున్నాడు. ఏ దేవుడూ మనస్సుకు తోచడు. వెంకటేశ్వరుడా! పార్ధసారధీ! కపాలేస్వరా! ఎవ్వరూ పలకరు? క్రిందపడి దొర్లాడు. అతన్ని చూసి బిడ్డలు గొల్లుమన్నారు. ఇంటివారు ఏమయింది అని మేడ మీదకు పరుగెత్తుకు వచ్చారు. నరసమ్మగారికి భయంలేదనీ, జరిగిన ఉపద్రవానికి జానకి రామమూర్తి బెంగా పెట్టుకొని ఏడుస్తున్నాడనీ ఆ చుట్టం చెప్పాడు. ఆ చుట్టమే ఎలాగో సముదాయించాడు జానకిరామమూర్తిని.
   వెంటనే పార్ధసారధి కోవెలకు పెద్దబిడ్డల నిద్దరిని తీసికొని పరుగెత్తి వెళ్ళి జానకిరామమూర్తి పదిహేను నారికేళాలు కొట్టి, సహస్రనామార్చన చేసి, తన భార్య బ్రతికితే మహాభోగం చేయిస్తానని మొక్కుకున్నాడు. కానీ తన