పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎన్నో ఆనందాలు ఊహించుకొన్నాడు తాను. అసలు హేమ ఈ బొంబాయి ప్రయాణం ఏర్పాటుచేస్తే తానెందుకు ఒప్పుకోవాలి? ఈలాంటి బాలికలతో తెరచాటున సంచరించాలిగాని, ఈ విధంగా బరిమీదపడితే ఎన్నో మొప్పాలు వస్తూ ఉంటాయి. హేమ దిగి వెళ్ళిపోవడమే మంచిదయింది. తన మేనేజరుకు ఈలాంటి విషయం తెలిసిందా తన పని క్షవరం. తానూ చల్లగా తిరిగి మదరాసుకుపోతే, అటునుంచి నరుక్కు రావచ్చును. అన్నీ సర్దుకొని తీర్ధమిత్రుడు రేణిగుంటలో దిగాడు. బొంబాయి నుంచి వచ్చే మెయిల్ తెల్లవారగట్లకు వచ్చినది. అందులో ఎక్కి తెల్లవారగనే మదరాసు వచ్చాడు. మదరాసు సెంట్రల్ లో టాక్సీకారు చేసుకొని అతడు ఇంటికి చేరాడు.

   ఇంటిలో అడుగు పెట్టగానే, క్రిందనున్న ఇంటి యజమాని ఇల్లు వదలి పెట్టి వెళ్ళిపోవలసిందని నెల నోటీసు చేతిలో పెట్టాడు. ఆలోచనకు తావులేక తీర్ధమిత్రుడు మేడపైకివెళ్ళగానే పిల్లలందరూ ఘొల్లుమన్నారు. తీర్ధమిత్రుని అయిదు ప్రాణాలూ పైకెగిరిపోయాయి. క్రిందటి రాత్రికిరాత్రే లోకేశ్వరి, కల్పమూర్తీ, త్యాగతీ పిల్లలకోసం, ఆ ఊళ్ళోనే ఉన్న తీర్ధ మిత్రుడుగారి దూరపుచుట్టాలలో ఒకాయననూ, అతని భార్యనూ, బిడ్డలనూ అతని అక్కగారినీ తీసుకువచ్చి తీర్ధమిత్రుడిగారి ఇంట్లో దిగబెట్టారు.                                                                                                                           
           
               

ఆ చుట్టపాయన వరండాలో కూర్చుని ఆ రోజు పేపరు చదువుకొంటున్నవాడు తీర్ధమిత్రుడు పైకి రాగానే, "ఓరి పశువా! ఎంతపని చేశావురా?" అన్నాడు. వంటింటిలోనుంచి వచ్చి "నాయనా! వచ్చావు. ఇంత కన్నా పెళ్ళాన్ని బిడ్డల్ని ఒక్కసారే విషమిచ్చి చంపేయలేకపోయావూ!" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. తీర్ధమిత్రుడు కాళ్ళు చచ్చుబడి అక్కడ ఒక కుర్చీ మీద చతికిలబడ్డాడు.

   చుట్టపాయన: నాయనా! నీ భార్య నిన్ను గూర్చి చీర అంటించుకుంది. జనరల్ ఆస్పత్రిలో చావు బ్రతుకులమీద ఉంది.
   చుట్టపాయన అక్క: నయమే! పిల్లల్ని తన్నూ కలుపుకొని అంటించుకొంది కాదు! ఎందుకు నీబోటివాళ్ళు పుట్టి?
   తీర్ధమిత్రుడు మాటలురాక తెల్లబోయి చూస్తున్నాడు. చుట్టపాయన చూపులు మండిపోతున్నాయి. చుట్టపాయన అక్క కళ్ళనీళ్ళు తుడుచుకొంటున్నది. తీర్ధమిత్రుని ఆడపిల్లలిద్దరూ తండ్రి దగ్గిరకువచ్చి, అతని ఒళ్ళో వాలి "అమ్మ చచ్చిపోయింది. నాన్నా! అమ్మ ఏది నాన్నా? అమ్మకావాలి నాన్నా! అమ్మను తీసుకురా నాన్నా!" అని గుండెలు అవిసేటట్లు ఏడవడం ప్రారంభించారు.
   చుట్టపాయన: నీభార్య నీమీద ఏదో అనుమానంపడి, చీర అంటించుకుంది. కానీ వెంటనే గొంగళికప్పి, ఇంటి ఆయన ఆర్పివేయడం చేత భుజం క్రింది భాగమూ, ఎడమరెక్కా కాలాయట. వెంటనే మూర్ఛపోయిందట. ఆయన