పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమను పిలవనంపనా?" అని లోకేశ్వరి అంది. కనకలత మోము నిండింది. "వద్దులే" అని నీరసంగా అంది.

   వెంటనే ఆమెను జనరల్ ఆస్పత్రికి అంబులెన్సుమీద తీసుకుపోయారు. లోకేశ్వరీ, త్యాగతీ, కల్పమూర్తీ కూడా జనరల్ ఆస్పత్రికి పోయి పొయ్యిలో నిప్పుకొంగు అంటుకొని ఈ ఆపత్తు జరిగిందని అక్కడా చెప్పి, ఆమెను వైద్యాలయంలో ప్రవేశ పెట్టించారు. కట్లుకట్టగానే లోకేశ్వరి కనకలతతో "కనకం, నీ భర్తను నువ్వు అనవసరంగా అనుమానించావు అని నా ఉద్దేశం. నువ్వు ధైర్యంతో ఉండు. నీకు ఏమీ అనుమానానికి తావులేదు. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నువ్వు బ్రతకాలి సుమా! పండ్ల లాంటి నీ బిడ్డల్ని మరచిపోకు, నీ భర్త పూర్తిగా మారిపోయే రోజులు వచ్చాయి. నేనూ వివాహం చేసుకుంటున్నాను తెలుసునా?" అన్నది!                                                                                                                             
           
               

"ఎవరిని?" అని కనకలత అడిగింది.

"నిశాపతిగారిని" అంటూ లోకం చిరునవ్వుతో ఉప్పొంగింది. కనకలతా నవ్వింది. "రేపువచ్చి నీ దగ్గరే ఉంటా" అన్ని చెప్పి లోకేశ్వరీ, త్యాగతీ, కల్పమూర్తీ వెళ్ళిపోయారు.
   త్యాగతి తన ఇంటికి వెళ్ళాడు. అతనికి రాత్రంతా నిదురలేదు. ఏ స్టేషనులో హేమ దిగివచ్చింది? తిరువళ్ళూరు దగ్గిర అయి ఉంటుంది. సెంట్రల్ స్టేషనులో అయితే ఆ వరకే వచ్చి ఉండవలసింది. అటు తీర్ధమిత్రుని భార్య దేహం కాల్చుకుంది. ఉత్తమ యిల్లాలు, పండువంటి భార్యను ఆ రాక్షసుడు గంగలో కలిపివేయడుకదా? ఇదా ప్రపంచ ధర్మంకై జీవిత నటన? హేమ తిరిగి రావడానికి ఏమి జరిగింది? హేమకూ తీర్ధమిత్రునికీ ఎంతవరకూ వెళ్ళింది? హేమ తీర్ధమిత్రునికి తన దేహం అర్పించుకుందా?? ఆమె గతి ఏమిటి? ఎక్కడికి పోతోంది ఈ సంఘం? వారిద్దరూ మర్యాదలు అతిక్రమిస్తే వారిద్దరికీ వివాహం ఒక్కటే గత్యంతరం అవుతుంది. అప్పుడు కనకలత ఏమవుతుంది?
   ఈ నాటకంలో తానే ప్రతినాయకుడు అయ్యాడు. తాను వచ్చి హేమను వివాహం చేసుకొనడానికి ప్రయత్నించకుండా ఉంటే? ఆ ప్రయత్నించడమూ ఏదో పిచ్చిరకంగానే! తనను తాను నాటకంలోలా తెలుపుకోకుండా ప్రయత్నం చేసినట్లు. దీనితో ముక్కుపచ్చలారని హేమకు ఒక విప్లవస్థితి వచ్చిపడింది. తా నసలు మదరాసే రాకుండా ఉంటే, ఏది ఎట్లా జరిగి ఉండునో? ఎదురుగుండా తను ఉంటే హేమ మనస్సును ఇంకా పాడుచేసిన వాడవుతాడు. ఏదో వంక పెట్టుకొని తానీ ఊరునుంచీ మకాం ఎత్తెయ్యాలి. చాలు! తా నింతవరకు ఇతర జీవితాలను దగ్ధం చేసింది చాలు! ఇక్కడనుంచైనా తా నితరుల జీవితాలతో సంబంధం కలుగజేసుకోకుండా మిగిలిన జీవితం గడిపినన్నాళ్ళు గడపవలసిందే!