పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాడి చాలాబాగా ఉందే! ఇంకా నయం. నేనూ హేమా వీళ్ళూ మా ఇంటిదగ్గర భోజనంచేసి, సినీమాకు వెడదామనుకున్నాము. హేమే ఏదో బెంగగా ఉందని చెప్పి సినిమా ప్రోగ్రాం మానిపించింది" అని అన్నాడు.

                                                                                                                35
   హేమ తల్లి పక్కలో అలాగే చేయిపట్టుకొని కూర్చుంది. కొమరిత చేయి పట్టుకొని రాజ్యలక్ష్మమ్మగారు నిదురపోయారు. నెమ్మదిగా దగ్గరగా జరిగి హేమ కదలకుండా అలాగే కూర్చుంది. ఏదో మహత్తరమైన శాంతి ఆమె జీవితం అంతా ప్రసరించినట్లయింది. ఆమె చిన్నబిడ్డ అయినట్లు తోచింది. అల్లా తనతల్లి దేవతలా నిదురపోతోంటే చూస్తున్న హేమహృదయంలో వేసవికాలంలో సముద్రగాలి తిరిగిన వెనక దేశం అంతా సుఖం ప్రసరించుతున్నట్లు, ఆనందం అలముకున్నది. తాను ఎలా తీర్ధ మిత్రునితో అలా వెళ్ళిపోవడానికి సంకల్పించుకొన్నట్లు? ఎందుకు అలా తిరువళ్ళూరు స్టేషనులో దిగి పారిపోయి వచ్చినట్లు?
   త్యాగతి, కల్పమూర్తి, లోకేశ్వరి అవతలికి వెళ్ళిపోయారు. వారు మువ్వురు హాలులోకి రావడంతోటే గ్రంధాలయం గదిలో ఉన్న టెలిఫోను మోగింది. త్యాగతి ఆ గదిలోకి వెళ్ళి టెలిఫోను చెవి దగ్గిర పెట్టుకొన్నాడు.
   త్యాగతి : "హల్లో! నేను త్యాగతీ శర్వరీభూషణున్ని. ఇది వినాయకరావుగారి ఇల్లు. ఆ! నేను తీర్ధమిత్రుడుగారిని బాగా యెరుగుదును. ఊఁ! ఏమిటీ? తీర్ధమిత్రుడుగారి భార్య, చీర అంటించుకొంటే 'మీరు వెళ్ళి గొంగళీ కప్పి ఆర్పినారా? వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. ఇదిగో కారు తీసుకువస్తున్నా. ఎవరో లేడీ డాక్టరుగారు వచ్చారా? మంచిది. ప్రాణాపాయం లేదుగద? ఇదిగో వస్తున్నా, అక్కడే చెప్పుదురుగాని, అంతట్లో ఆస్పత్రికి అంబులెన్సుకు ఫోను చేయండి! ఆఁ."
   త్యాగతి ఫోను పెట్టివేసి, హాలులోకి రెండంగలువేసి, కల్పమూర్తినీ లోకేశ్వరిని తనతో రమ్మని, మామగారితో కారు తీసుకు వెళ్ళుతానని చెప్పి, ముగ్గురూ కలసి ట్రిప్లి కేను వెళ్ళారు. వీరు అక్కడికి వెళ్ళేసరికి అంబులెన్సు కారూ వచ్చివుంది. ముగ్గురూ మూడంగలలో మేడెక్కారు. ఒక లేడీ డాక్టరుగా రున్నారు. నౌకరు, నర్సులు కనకలత గదిలో ఉన్నారు. లోకేశ్వరి లోనికి పోయింది.
   కనకలత ఎడమచేయీ, వీపు కాలింది. ఆమె నిస్ప్రహలో అతి నీరసంగా ఉంది. లోకేశ్వరి లేడీ డాక్టరుగారి మొగం చూచి, "అమ్మా, మా హేమ కూడా వస్తానంది. వాళ్ళమ్మకేదో జబ్బు చేయడంవల్ల రావడానికి వీలులేకపోయింది" అన్నది. కనకలత కళ్ళు తెరచి లోకేశ్వరిని తీక్షంగా చూసింది. లోకేశ్వరి కనకలత దగ్గరగా వెళ్ళింది. "హేమ ఎక్కడికీ వెళ్ళలేదా?" అని కనకలత ప్రశ్నించింది.
   "కనకం, మేమంతా కలిసి మహాబలిపురం వెళ్ళివచ్చాం. మీ ఆయన తన కంపెనీ పనిమీద బొంబాయి వెడుతూంటే మేమంతా సాగనంపే వెళ్ళాం.