పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నర్సు నవ్వుతూ లోపలికి వచ్చింది. డాక్టరుగారూ, రాజ్యలక్ష్మమ్మ గారూ నర్సువైపు చూచారు.


   నర్సు: త్యాగతిగారు తమ అత్తగారిని చూడవచ్చునా అని అడుగుతున్నారు.
   డాక్టరు : త్యాగతిగారూ చూడవచ్చును, హేమగారూ చూడవచ్చును. 
   నర్సు : తండ్రీ కూతుళ్ళిద్దరూ కంగారుపడుతూ కూరుచుని ఉంటే, రాజ్యలక్ష్మమ్మగారికి బాగా కులాసాగా ఉందని చెప్పానండీ డాక్టర్.
   రాజ్య : (కొంచెం దృఢపడిన కంఠంతో) తండ్రీ కూతుళ్ళిద్దరూనా?
   డాక్టరు : ఏ తండ్రీ....మన ఇంట్లో ఉన్న తండ్రే. వినాయకరావు గారూ...అయితే నర్స్, హేమగారూ వచ్చారేమిటి?
   నర్సు : వారంతా వచ్చి పదినిమిషాలయిందనుకుంటాను.
   డాక్టరు : అంతా అంటే?
   నర్సు : త్యాగతిగారు, కల్పమూర్తిగారు, లోకేశ్వరిగారు, హేమగారూ.
   రాజ్య : మా హేమ వచ్చిందా! (ఆమె గుండె చాలా వేగముగా మోగుతున్నది.)
   డాక్టరు : నర్స్, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు?
   రాజ్య : ఎప్పుడూ ఏదో చోటుకు షికారు వెడుతూనే ఉంటారండీ. (ఆమె నాడి చాలా నిదానత పొందింది.)
   డాక్టరు : నర్స్! నువ్వు ఇక్కడ కూర్చో. వాళ్ళ నలుగురినీ లాక్కొని వస్తాను.
   డాక్టరు హాలులోకి వచ్చాడు. డాక్టరుగారు హాలులోనికి వచ్చేసరికి, హేమ తండ్రి దగ్గర కూర్చునిఉంది. లోకేశ్వరి వినాయకరావుగారి అవతల పక్కగా నిల్చొని ఉంది. త్యాగతి బల్లదగ్గర నిలుచుండి, ఆ హాలులో ఉన్న నూనెరంగుల చిత్రాలు చూస్తూ ఉన్నాడు. కల్పమూర్తి ఒక కుర్చీలో కూర్చుండి సిగరెట్టె కాల్చుకుంటూ పైకి చూస్తున్నాడు.
   డాక్టరుగారు త్యాగతిని చూచి, "ఏమండీ త్యాగతిగారూ, మీ అత్త గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మీ నలుగురూ ఈ ప్రపంచం అంతా చక్కర్ కొట్టి వస్తున్నారని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పాను సుమండీ! ఆ ముక్కలే జాగ్రత్తగా చెప్పండి వారితో" అంటూ, "రండి అందరూ. త్యాగతిగారూ, హేమగారూ, హేమగారి కారులో కూర్చుని కదూ నాకు కనబడింది? అప్పుడు సాయంకాలం ఆరున్నర అయివుంటుంది. సాక్ష్యం బాగా చెప్పకపోతే జడ్జీగారి తీర్పు వ్యతిరేకం అవుతుంది. లోకేశ్వరిగారూ, మీరు కారు వెనక సీటులోనా?" అన్నారు.
   అందరికీ అర్ధమైంది. అందరూ లోనికి వెళ్ళారు. రాజ్యలక్ష్మమ్మ గారి దగ్గరకు హేమ వెళ్ళి, "అమ్మా, ఏమిటే ఈ గడబిడ? బావా, నేనూ, వాళ్ళు షికారు వెళ్ళివచ్చాము" అన్నది. రాజ్యలక్ష్మమ్మగారి గుండె నుంచి కోటిబరువులు తీసివేసినట్లయింది. త్యాగతి అత్తగారి చేయి తీసుకొని నాడి చూసి, అత్తయ్యగారూ! మా అమ్మకోసం కారు వెళ్ళింది! ఈపాటికి వస్తూ ఉంటుంది,