పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34

   ఈ టెన్నిస్ తార ఏదో ఆలోచనలో వున్నదనీ, అందుకోసం జవాబులు సరీగా చెప్పటంలేదనీ ఆ యూరోపియను బాలిక లనుకున్నారు. ఎందుకు తిరువళ్ళూరుదాకా వచ్చింది ఈమె?
   తన జన్మఅంతా ఒక పెద్ద ప్రహసనం అయిందని హేమ అనుకుంది. ఇంత వేళాకోళమై వెక్కిరింతలై ఇంతడబ్బు నీటిలా ఖర్చుచేస్తే కానీ నిజం తెలియలేదు హేమకు. కొంతకాలం ఆలోచనలు ఏమీ లేకుండా పడిఉంది. మదరాసు స్టేషను వచ్చింది. హేమ లేచి, ఆ యూరోపియను బాలికలనూ క్షమాపణ అడుగుచు తా నత్యంత ముఖ్యమైన కార్యం విషయంలో మనస్సు లగ్నం చేసుకొని వుండడంవల్ల తాను వారితో మాట్లాడలేక పోతినని చెప్పుకొని, వీధిలోనికి వచ్చి తిన్నగా ఒక టాక్సీని పిలిచి అందులో అధివసించింది.
   అప్పటికి రాత్రి 9-20 గంటలయింది. తిన్నగా ఇంటికి వెళ్ళి, ఇంటిలో అడుగుపెట్టింది. హాలులో వినాయకరావుగారూ, వారి డాక్టరు గారూ, పలువురు సేవకులూ ఉన్నారు. పోర్చిలో కారు ఎవరిదా అంటూ లోపలికి వచ్చింది హేమ!
   తండ్రి హేమను చూచి ఒక్క ఉదుటున లేచి "నాన్నా! నాన్నా ఎక్కడికి వెళ్ళావు?" అంటూ మొగం తిరిగి కుర్చీమీద కూలబడ్డాడు. డాక్టరుగారు రెండడుగులలో వారి దగ్గరకు వెళ్ళి, "ఏమిటండీ ఈ గడబిడ వినయకరావుగారూ? మీరు కూడానా?" అని అంటూ వెంటనే తన మందుల పెట్టెకడకు ఉరికారు.
   హేమ భయభ్రాంతయై గజగజ వణుకుథూ తండ్రి దగ్గరకు పరుగెత్తింది. డాక్టరుగారు వినాయకరావుగారి ముక్కు దగ్గర హేమను ఒక సీసా వాసన చూపించమని చెప్పి, నాలుగు చుక్కలు 'నక్స్ వామికా', ఇరవై చుక్కలు 'స్పిరిట్స్ అమ్మోనియం అరెమేటికా' వేసి నీళ్ళుకలిపి, కళ్ళు తెరచిన వినాయకరావుగారిచేత తాగించారు.
   హేమ కళ్ళనీరు కారిపోతుండగా, "నాన్నగారూ, ఏమిటి కంగారు?" అనితండ్రి ప్రక్కన కూర్చుండి అడిగింది. వినాయకరావుగారికే కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆయన దీనంగా కుమార్తెవంక చూస్తూ, "మీ అమ్మ చావు బ్రతుకులలో వుంది నాన్నా!" అన్నారు.
   "అమ్మా!" హేమకు పట్టరాని దుఃఖం వచ్చింది. ఆమె అనుకున్నట్లే అయింది. ఈ మహావిషాదానికంతకూ తానే నాయకురాలు అని ఆమె అమ్మకూ అర్ధమైపోయింది కాబోలు. ఎలావుంది తల్లికి? ఆమె అతి దీనవదనంతో డాక్టరుగారివైపుకు చూచింది.
   డాక్టరుగారు హేమను చూచి, "ఏం ఫరవాలేదమ్మా. మీ అమ్మగారిని బ్రతికించే భారం నాది" అన్నారు. "నేను లోపలికి పిలువనంపగానే మీ అమ్మగారి దగ్గరకు రా; ఈలోగా మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉండు" అని డాక్టరుగారు లోపలికి వెళ్ళారు. హేమ తండ్రివంక తిరిగి, "నాన్నగారూ, ఏమిటి గడబిడ అంతానూ? అమ్మకు జబ్బెమిటి?" అని అతిదీనంగా అడిగింది.