పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలాంటి బావను తను ఎన్ని రకాలుగా బాధించింది. అతనితో చేయించరాని పనులు చేయించింది. అతని మనస్సు నొప్పించింది. తనవంటి తుచ్చరాలిని అతడు స్వీకరిస్తాడా! అతని ప్రతి అణువూ తాను ప్రేమించింది. ఆ ప్రేమకాంతితో తాను నిల్చోలేక పోయింది.

   "ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా? ఈ ఏడు టెన్నిస్ పందేలలో ఆడ్తారా? నిరుడు మీరూ ఒక పొడుగు పెద్దమనిషీ, స్త్రీ పురుష జట్టు పోటీ పందేలలో మొదటి బహుమానం పొందారుకాదూ!" అని ఆ యూరోపియను బాలికలలో ఒకామె అడిగింది.
   రైలు విల్లివాకం వచ్చింది. "అవునండీ. ఈ సంవత్సరం పందేల లోనూ పాల్గొనాలానే ఉంది" అని హేమ అన్నది. ఏమిటీ మధ్య మధ్య స్వప్న భంగం అని హేమ అనుకొంది. కానీ వారూ తన బావను గూర్చిన స్వప్నంలో భాగమే అయ్యారు.
   శ్రీనాథమూర్తి బావ ఎంత చక్కని టెన్నిస్ ఆడ్తాడు! అతన్ని ఈ ఏడు ప్రోత్సాహంచేసి టెన్నిస్ తాను ఆడించగలుగునా? ఛీ! ఛీ! ఎలాంటి పిచ్చి ఆలోచనలు? అతన్ని నానా దుర్భాషలాది అతని ప్రేమను కాలితో తనని, ఒక హీనపశువులా, స్త్రీ ప్రేమను ఏ మాత్రమూ గౌరవంతో చూడని ఒక నరనామక పశువుతో లేచిపోయి, అతనికి తన దేహం యావత్తూ అర్పించడానికి సిద్దమైన తనను తన బావ దగ్గరకు రానిస్తాడా? రానివ్వకేం! ఒకనాడు సుశీల నాతడు చేరదీయలేదా? ఆ చేరనియ్యడం, ప్రభుత్వంవారి రక్షవంటిది. ఆ బాధనుంచేగా అతడు దేశాలనీ తిరిగి కైలాసం పారిపోయాడు! ఇప్పుడాతడు సంపూర్ణ పురుషుడు. అతనికి కావలసింది సంపూర్ణ స్త్రీ. తాను పదోవంతు స్త్రీయైనా కాదు.
   ఇంతట్లో రైలు పెరంబూరు వచ్చింది. రైలు చెన్నపట్నం చేరుతోంది. తాను పారిపోయిన సంగతి, తన నీరసపు కాంక్షలు తల్లిదండ్రులకు తెలియలేదుకదా! తల్లిదండ్రులకు ఆ వార్త పిడుగులా సోకి నాశనం చేయలేదుగదా! లోకేశ్వరి ఏమనుకుంటుంది? కల్పమూర్తి ఉత్తముడు. అతడేమనుకుంటాడు? ఒకరిని గురించి ఒకరు ఏమనుకుంటారు? ఏమనుకుంటే ఏమి? 'ఏమనుకుంటారో!' అనే నీరసభావం లోకాన్నిపూర్వకాలం నుంచీ తగలేసింది. మహాత్మా గాంధీజీకి లోకం ఏమనుకుంటుంది అనే ప్రశ్నలేదు, మనస్సు నిర్మలంగా ఉంచి, మన నడవడిని మనమే నిర్ణయించు కోవాలి. ఏమనుకుంటుంది లోకం? అన్న గుడ్డిభయం పనికిరాదని యెన్ని సారులో అన్నాడు. తానూ తన జీవితంలో తనను పరిశోధించుకుంటున్నది.