పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీ పాదలకడ నా ప్రాణం విడుస్తాను అన్నాడు. మోకరించాడు. నాకు పట్టరాని కోపం వచ్చి అతని మొగం మీద తన్నాను అని చెప్పింది.

    మంచిపని చేశావు! నువ్వు  అతనికి ఏదో ఆశకొలిపావు. అందుకని అలా అన్నాడు. ఇక్కడ నుంచి నా దగ్గర అతన్నేమీ అనడానికి వీలులేదు. నీకు ఇష్టం లేకపోతే నాతో మాట్లాడడం మానెయ్యి  అని హేమ మళ్ళీ మంచం మీద వాలింది.
   
                                                                                                              28
   లోకేశ్వరి  ఆశ్చర్యపడుతూ క్రిందికి దిగింది. హేమకు ఏమిటి ఈ విచిత్రస్థితి!  తీర్థమిత్రుడంటే అంత ఇష్టమా? లేక ఇతరుల భావాలకు వ్యతిరేకాభిప్రాయ మివ్వడం అనే గయ్యాళి మనఃస్థితి ఉంది. ఆ మనస్థితిలో పడిందా హేమ! అనుకుంటూ లోకేశ్వరి కించపడిన హృదయంతో తన గదిలోనికిపోయింది.
   తాను వినాయకరావు, వెంకట రాజ్యలక్ష్మమ్మగార్ల అనుమతితోనే నిశాపతికి ఉత్తరం రాసింది. అంతక ముందే నిశాపతి తన భావాన్ని  వ్యంగ్యంగా తెలియజేస్తూ ఎంతో  చక్కని ఉత్తరాలు వ్రాశాడు.


                                                                                                      మొదటి ఉత్తరం
                                                                                                                                                                                                  20 వీధి, లక్నో
     ప్రియమైన లోకేశ్వరీ!                                                                                                                                                                 4-10-1945
   మిమ్ముల్నందరినీ  వదలివచ్చి నాలుగునెలలు అయింది. నేను ఎందుకంత విచిత్రంగా పారిపోయానో ఈపాటికి  మీకందరికీ అర్థమై ఉంటుంది. నాకు సంగీతంలో  ఎంత శక్తి ఉందో స్త్రీ విషయ నీరస  హృదయముంది. గొప్ప సంగీత పాఠకులకు అనేక జనానాల తలుపులకు గడియలుండవు. కాని, నేను  ఏ కుటుంబంలో స్త్రీని  నా నీచత్వంతో అధఃపతితురాలిని చేయలేదు అని  సర్వవిశ్వం సాక్షిగా  నీతో మనవిచేస్తున్నాను.  ఎవరోకొందరు పెద్దరికం  పుణ్యాంగనలు నాతో గాఢస్నేహంగా ఉండేవారు-అంతే!
   అలాంటిది హేమకుసుమసుందరీదేవిగారిని చూడగానే  నాకుయుగాలనాటి  స్నేహితురాలనిపించింది. ఆమెతోటి స్నేహం, నన్ను పూర్తిగా మార్చింది ఆమెను ప్రేమించాను అనుకొన్నాను. సర్వలోకాలు నేను  త్రివిక్రముడనై పొంగిపోయాను అనుకున్నాను. నా మనస్తత్వమే పూర్తిగా మారిపోయింది. ఆబాలిక ఎప్పుడు నన్ను కాదు అని అన్నదో నంది పర్వతాలకు పారి పోయాను. ఆ నందిపర్వతాలలో  ఒక నెల జీవచ్ఛవంలాపడి వుంటిని. నా జీవితాన్ని ఏ కొండలమీదనుంచో క్రిందికి త్రోసుకొని సహస్రశకలాలు చేసుకుందామనీ, ఆ వార్తవిని హేమా, మీరూ బాధపడతారనీ ఊహించు కొన్నాను, కోపంతో మండిపోయాను, ఏడ్చాను.