పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకేశ్వరి కంగారు, వణుకుచూచి, హేమ భయపడి, లోకేశ్వరి గదిలోకి వెళ్ళింది. ఆమె కుర్చీలో కూలబడి కొంచెం నవ్వుతూ, కొంచెం ఏడుస్తూ వున్నది. హేమను చూడగానే లేచి వచ్చి ఆ బాలిక హేమను కౌగిలించుకొని హేమ అని మాటరాక ఊరుకుంది.

    ఏమిటే లోకం, ఏమిటి కంగారు? ఆ టెలిగ్రాం నేను చూడవచ్చునా? అని అడిగింది.
    అ! తప్పక  అంటూ సిగ్గుపడుతూ కంటనీరు తుడుచుకుంటూ, చిరునవ్వుతో మోము ప్రపుల్లమైపోవ ఆ తంతివార్త  హేమకు యిచ్చింది. డిల్లీ-11ఏప్రిల్-ఉదయం-7-20.
   లోకేశ్వరి, వినాయకరావుగారి ఇంట్లో, 24   డేన్మోర్ గ్రౌండ్స్ - లోకం నువ్వు దేవకన్యవు-ఆరు నెలలునుండి-నా-మనస్సు-నీ-మీద-లగ్నం-నీకు-ఉత్తరం-రాయడానికి-సిగ్గు-పడ్డాను-నీ-పేరు-నాకు-సంతత-దేవీ-నామ-స్మరణ-నీ ఉత్తరం-దివ్య-ఆనంద-వరం-త్వరలో-ముహూర్తం-మామగారిని-సంప్రదించి-ఏర్పాటు-చేయి.  హేమను-మామగారిని-అత్తగారిని-త్యాగతి-కల్పమూర్తిని-అడిగాను-పెద్ద ఉత్తరం వెంటనే-మామగారికి-ఉత్తరం-నీపాదాలకడ-మోకరించి-నీ-ప్రియ-అతి-ప్రియుడు-నిశాపతి అని తంతివార్త రెండు కాగితాలలో ఉంది.
   హేమ లోకేశ్వరివైపు తీక్షణంగా చూచింది. కొంచెం అపహాసం ఆ పెదవుల ఎడమభాగంపై ప్రసరించింది.
   హేమ : ఇదా కథ! యెన్నాళ్ళనుంచీ ఈ నాటకం  నడుస్తూంది? నాతొ చెప్పడం అవమానం అనుకొన్నావు కాబోలు! అచ్ఛా!నీకు  నా మనఃపూర్వకాభివందనాలు!
   హేమ  మాటలో నిండివున్న హేళన అంతా  లోకేశ్వరి గ్రహించింది. ఆమె గబుక్కున లేచి, హేమ దగ్గరకు వచ్చి, ఆమె రెండు  చేతులూ తీసి, తన రెండు చేతుల్తో పట్టుకొని,  హేమా! నీతో చెప్పలేదని కోపమా? హేమా!  నేను మొదటినుంచీ నిశాపతిని ప్రేమించాను. అతను నా మొగమైనా తిన్నగా చూసేవాడుకాదు. అలా రహస్యంగా నా హృదయంలో దాచుకొని  ఉంటిని. అతడు నిన్ను ప్రేమించేవాడు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలీయలేదు. అలాగే భగవంతుని ప్రార్థిస్తూ నా హృదయంలోని  భావాన్ని అక్కడే చంపేసుకోవాలని ప్రయత్నంచేస్తూ, సాధ్యంకాక లోపల కులుముతూ, భగవంతుడు మీ ఇద్దరినీ కలుపుగాక అని కోరుతూ ఉండేదాన్ని. కాని నాకు అతని చరిత్ర నెల్లూరునుంచీ మా చుట్టం ఒకాయన ఉత్తరం  రాశాడు. అంతగొప్ప సంగీత పాటకుడైన అతడు  ప్రవరాఖ్యునిలా ఉంటాడని అనుకోలేదు సుమా! కాని చుట్టం రాసిన చరిత్రవంటి చరిత్ర నిజమై ఉంటుందా అనీ, ఆకాశంలోనుంచి కురిసే వర్షబిందువువంటి నిర్మల చరిత్రగల  నా హేమ అతనిగుణం మంచిది కాకపొతే ఎలా స్నేహము చేయగలదనీ అనుకున్నాను. రహస్యంగా కంటినీరు కడవలు కార్చాను. హేమా! ఆ రోజులన్నీ నాకు యమయాతనే! అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు,  నేను అతన్ని ప్రేమిస్తుంటిని. నా