పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాలేజీ బాలికలకు పోటీవచ్చి డబుల్స్ లో సోఫీ, హేమా విజయం కావించినారు. సోఫీ సింగిల్స్ లో నెగ్గింది. హేమను ఓడించిందంటే జబ్బ పుస్టీ, దమ్మూ ఉన్న సోఫీ కొక్కదానికే చెల్లు. ఆ సమయంలో కల్పమూర్తి, హేమకు స్నేహం కలిగింది. హేమ అప్పుడు బి. ఏ. ఆనర్సు మొదటి తరగతి చదువుకుంటున్నది. హేమను ఆట డ్రెస్సులో చూచిన కల్పమూర్తి గుండె పదిహేను నిమిషాలాగిపోయింది. అతడే ఏ కావ్యనాయకుడో అయి ఉంటె! ఆ కోర్టులో విరుచుకు ప్రణయమూర్చలో పడిపోయేవాడే! ఆమె నానారాజ్య ఒలింపిక్ టెన్నిస్ ఆటలోని బంగారుగిన్నె బహుమానమై అతనికి తోచింది. బ్రాడ్ మన్ గారిని ఓడించగల క్రికెట్టు ఆట మూర్తికట్టి వచ్చినట్లాతనికి హేమ ప్రత్యక్షం అయింది. ఆమె పదివేల రూపాయల ఖరీదుగల టెన్నిస్ బేటు అని ఉప్పొంగిపోయాడు. ఆమె ఈతని అద్భుతమూర్తిని చూచి ఆటకు తగిన పురుషుడే అనుకొంది.

   హేమ నియోగ బాలిక, పెళ్ళికాని అమ్మాయి. తన గోత్రానికి తగిన గోత్రం అని తెలుసుకోగానే అతడు హిమాలయ పర్వతంలా  ఆకాశం అంటాడు. వెంటనే ఆమె బి. ఏ. ఆనర్సు  చదువుకొంటోంది. అనగానే  పసిఫిక్కు లోతుల్లోపడి ఊరుకున్నాడు. అయితే ఏమి? చదువూ, ఆటలనేర్పు రెండూ ప్రయాగక్షేత్రం కాగలవని అతడు  ధైర్యం తెచ్చుకొని హేమతో  స్నేహం వ్రుద్దిచేసుకొన్నాడు. అతడు మైలాపురం దగ్గర గోపాలపురంలో మేడ కొనుక్కున్నాడు. హేమ చేతనే ఆ మేడంతా అలంకరింపించాడు. ఆ బాలిక  కొనమన్నదల్లా కొన్నాడు. ఆమె ఇది మచిదంటే స్టుడి బేకర్ కారు కొన్నాడు. అతడే స్వయంగా  నడుపుకొనేవాడు. అతడు జిర్రున చీది ఎరుగడు. ఇంతకన్న హేమకు  తగిన భర్త ఎవరు? అని  అనేకులు  పెద్దలతో  సంప్రదించి  సంబంద నిశ్చయానికి  వినాయకరావుగారితో ముచ్చటింపించినాడు. వినాయకరావుగారు  మా అభ్యంతరం ఏమీ  లేదయ్యా, మా అమ్మాయి ఇష్టమే అన్నారు. 
   ఇంక హేమను అడిగేదేట్లా?  అతనికి ఎవరన్నా, భయంలేదు. అందరూ స్నేహితులే  తండ్రిగారు పత్రాలరూపంగా బ్యాంకులో  డిపాజిట్టుల రూపంలో  నిల్వచేసి వెళ్ళిన  ధనబలం అంతా  అతని వెనకాల ఉంది. విగ్రహం అపోలో విగ్రహం . ఏ గడ్డుపని ఎవరికి అవసరం వచ్చినా అది  అతిసమర్థతతో నిర్వహించగలడు. ఇంతకన్న  ఆ ఆటల సుందరి  భర్తకు కావలసిన గుణగణాలు ఏమిటిగనకా?
                            

శ్రీనివాసరావుకు కల్పమూర్తి అని పేరు పెట్టింది హేమ. హేమ అందరికీ పేర్లు పెట్టింది, అంటే అవి రూడియై పోయాయన్నమాటే! శ్రీనివాసరావు తెలివితేటలతో నిర్వికల్పమూర్తిఅట. కాని కల్పించిన పని సాధించ