పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయినా నా మనసులో ఉన్న రహస్యభావాలు కాసిని, ఆ నా ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్ళతో చెప్పుతూ వుండడం, వాళ్ళ హృదయాలు వాళ్ళు నాకు తెలియజేయడం మాకు పరిపాటే. మేం ముగ్గురం ఎక్కడో కలుస్తూనే ఉండేవాళ్ళం.

    అందులో ఓ అమ్మాయికి మద్రాసులో ఒక బాలికా పాఠశాలలో ఆంద్రోపాద్యాయిని పని అయింది. ఆమె రూపు రేఖా విలాసా లంటారా? ఉంటాయి ఒక మోస్తరు. ఆ అమ్మాయి అతి ఆడపిల్ల. చూపులో దగ్గర వస్తువులు కనబడతాయి. అందుకని షార్ట్ సైట్ అద్దాలు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయికి నేనె లోకేశ్వరి అని పేరు పెట్టినాను. ఆ అమ్మాయి అసలు ఊరు ఒంగోలు. అసలు పేరు దుర్వాసుల వెంకటరత్నమ్మ. నెల్లూరులో తన చుట్టాల ఇంటికడ ఉండి చదువుకొని, స్కూలు ఫైనలు ప్యాసయి చెన్న పట్నం ఇంటరు చదువుకని వచ్చింది.

    అప్పటినుంచీ నాకూ, 'లోకా'నికీ చూపులతోనే ప్రేమ కుదిరింది. లోకం ఎంత తెలివైనది ! చెన్నపట్నంలో మాయింట్లోనే నాతోపాటే ఉండి చదువుకోమని పట్టుపట్టినాను. మా ఇంట్లోనే భోజనం చేసేది. మా నాన్న గారూ, మా అమ్మగారూ లోకం అంటే ప్రాణం ఇచ్చేవారు. కన్నా కూతురైన నాకన్న వాళ్ళిద్దరి దగ్గరా ఆమె ఎక్కువ చనువుగా ఉండేది. మాయమైపోయిన మా అక్కని మరపించేటంత ఆపేక్షగా వుండేది. మా అక్క ఫోటో తన గదిలో పెట్టుకొని పూలదండలు వేసేది. రెండు మూడుసార్లు మా అక్క బొమ్మను హృదయాని కద్దుకొని కంటినీరు పెట్టుకోవడం కూడా నేను చూశాను.

    లోకమే మా అమ్మనీ, నాన్ననీ సినిమాలకు, నాటకాలకు అడయారుకు, బీచికీ తీసుకువెడుతూ ఉంటుంది.

    మా అక్కను పూర్తిగా జ్ఞాపకం చేసుకోలేను. మా అక్క అమృత మూర్తట. దివ్య సౌందర్యవతట. నా ఆరవఏటనే మా అక్కకు పెద్ద జబ్బు చేసి వెళ్లిపోయింది. మా అక్క, నేనూ ఒక్కటే పోలిక. మా అక్క పోయేటప్పటికి పదహారేళ్ళది. నాకు పదహారేళ్ళు వచ్చినపుడు అచ్చంగా మా అక్కలాగే ఉన్నాను. మా ఇద్దరి ఫోటోలు పక్కపక్కగా పెట్టితే ఒక్కరి ఫోటోలే అని చెప్పవలసిందే. ఏ మాత్రమూ తేడాలేదు. ఆ రెంటికీ.

    మా బావను తలచుకుంటే ఏదో కలలో చూసిన మనిషిలా జ్ఞాపకం వస్తాడు. నన్నస్తమానం ఎత్తుకునేవాడు. మా అక్క అంటే ప్రాణం ఇచ్చేవాడు. మా అక్క మా బావనూ, మా బావ మా అక్కనూ ఒక్క నిముషమూ వదిలి పెట్టి ఉండలేకపోయేవారు.

    నా చిన్నతనంలో మా ఊళ్లోనే ఉన్న మా అక్కగారి అత్తగారింటికి వెళ్ళినా, మా అక్కా, బావా మా ఇంటికి వచ్చినా ఒక్క నిమిషం ఇద్దరూ వదిలి ఉండేవారా! నేను మా అక్క దగ్గరకు వెడితే ఇద్దరూ ఒక కుర్చీలోనే కూర్చునో, ఒక మంచంమీద ఇద్దరూ పడుకొని మాట్లాడుకుంటూనో ప్రత్యక్షం అయ్యేవారు.