పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ ఈడులో ఆనాడు మా అక్కా, బావల ప్రణయం లోకాతీతమైనదని తెలిసింది నాకు. మా బావ ఇప్పుడెక్కడున్నాడో? బ్రతికివున్నాడో, లేదో ?

ఇంతకూ మా లోకం మా అక్కను ఒక దేవతగా యెంచి, ఆమె ఫోటోను పూజించేది. ఆ ఫోటోపై పూలూ, కుంకుమా చల్లేది. రోజూ ఆ చిత్రానికి పూలదండలు వేసేది.

ఇదంతా మా తలిదండ్రులను టోపీలో వేసుకునేందుకు కాదని నేను నిస్సందేహముగా చెప్పగలను. ఎందుకంటే, ఒంటిగా ఉన్నప్పుడు కూడా మా లోకం నేనుగాని, మా స్నేహితురాండ్రుగాని ఎవ్వరూ చూట్టం లేదను కొన్నప్పుడే అక్క బొమ్మ హృదయానికి అద్దుకొని కళ్ళనీళ్ళు తిరిగిపోతూ వుండగా, ఏదో పెదవులలో గొణుగుకుంటూ కుర్చీ మీద కూర్చొని ఉండేది. మా లోకానికి మా అక్క అంటే అంత ప్రేమ ఎందుకు కుదిరిందో? ఆ ప్రేమకు కారణం ఏమిటో తెలిసికోవాలన్న ప్రయత్నం చేశాను. నేను మా అక్కలా ఉంటానని, మా అక్క పోయేముందు మా బావతో తీయించుకున్న ఫోటోలో మా అక్క వేసిన వేషం నాకు వేసి, లోకం నా ఒళ్లో తల పెట్టుకొని కన్నీళ్ళు కార్చేది.

    ఒకరోజు నేనూ, లోకేశ్వరి నా విద్యామందిరంలో మాట్లాడుకుంటున్నాం. మందగమనంతో అవతరించినది నా రెండో ప్రాణ స్నేహితురాలు సోఫీ. సోఫీ భారతీయాంగ్లబాలిక, ఆమె తండ్రి నీలగిరిలో కాఫీతోటల యజమాని, లక్షాధికారి. తల్లి చిన్నతనంలో ఈమెను కని ఇంగ్లండులో చనిపోయింది. సోఫీ ఇంగ్లండులోనే చిన్న తరగతులు మాతామహుల ఇంట నుండి చదువుకుంది. తండ్రి ఆమెను వదిలి ఉండలేకపోయినాడు. కళాశాల చదువుకు హిందూదేశమే తీసుకువచ్చాడు. ఆమె నాతోపాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటరు చదువుకుంది. ఇప్పుడు నాల్గవ సంవత్సరము ఎం.బి.,బి. ఎస్. క్లాసు వైద్యకళాశాలలో చదువుతున్నది. తండ్రి, తాతలు ఇంగ్లండులోనే పుట్టినా జీవితాలు నీలగిరి కొండల్లో గడపతంచేత, వాళ్ళు సంపూర్ణంగా భారతీయులే అయ్యారు. సర్ విలియమ్స్ విలియంగారికి సోఫీ ఏకపుత్రిక, ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

    నాకూ, సోఫీకి ఎందుచేతనో విపరీతమైన స్నేహం కుదిరింది. సోఫీ మగరాయుడు. రూపంలో గాడు సుమండీ! రూపంలో రతీదేవే! తండ్రి థియాసఫిస్టు అవడంచేత ఈవిడా థియాసఫిస్టే, అందువల్లనే ఆమెకూ నాకూ గాఢ స్నేహం అవడానికి కారణం అనుకుంటాను.

    నువ్వు నాతో ఇంగ్లండు రావాలి అని వేధిస్తూ ఉంటుంది.నాకూ వెళ్ళాలనీ ఉంది.

    యుద్ధం అవనీ సోఫీ!తప్పక వస్తాను అన్నాను.

     మనం ఇద్దరం నర్సులుగా చేరిపోదాం.