పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    నా హృదయం మహతివీణే కాదు. మహామహతివీణె. వేయి తీగెలతో, వేయి మెట్లతో లోకాలు ఆవరించుకొన్న విప్రకృష్టమైన మహా మహతివీణె. ఆ అద్బుత పల్లకి తంతులలో తెలిసో తెలియకో పంచమ సర్వపూరితమైన ప్రాణ తంత్రిని మీటి నా జీవితాకాశంలో కాకలీ స్వరాలు మారు మ్రోగించినాడు త్యాగతి. ఎవరీ త్యాగతి? రాత్రల్లా సగం తెలిసిన నిద్ర. కలలుపూనిన కాళరాత్రి. గంభీర రూపాలు ఆవహిల్లిన అనంతదాయము. అందులో ఎచ్చటనో ఉన్నాడితడు.

                                                                                                                      15

    నాకు యిద్దరు యువతీమణులు స్నేహితులున్నారు. స్నేహితులంటే చాలా సన్నిహితురాండ్రై నాతో జీవికాజీవులులాగ మెలిగేవాళ్ళని నా అభిప్రాయం. వీళ్ళు కాక నాతో చదువుకున్నవారు, నా సతీర్డులు అయిన చెలిమికత్తెలు చాలామంది ఉన్నారు. అందులో కొందరు కొంచెం దగ్గరగా ఉంటారు, కొందరు కొంచెం దూరం, ఇంకా కొందరు ఇంకా కొంతదూరంలోను ఉంటారు.

    నేను కాలేజేలో టెన్నిస్ బాగా ఆడేదాన్ని. విద్యార్ధినీ బృందంలో నన్ను మించిన ఆటకత్తెలు లేనేలేరు, వరుసగా రెండేండ్లు నేనె ఛాంపియన్ షిప్ టెన్నిస్ కప్పు విజయం పొందాను. పరుగులో దిట్టమైన బాలికను. సంచి పందెము వగైరాలో ఒకటో స్థానమో, రెండో స్థానమో వచ్చేది. ఆ ఆటల సందర్బంలో ఎందరో బాలికలు స్నేహితురాళ్ళయ్యారు. వీరందరినీ కలుసుకుంటూ ఉంటాను. మా యింటికి విందుకు పిలుస్తూంటాను.

    నాకు అత్యంత సన్నిహితులయిన ఆ ఇద్దరు స్నేహితురాండ్రనూ ప్రాణ స్నేహితురాళ్ళంటాను. మా ముగ్గురిలో రహస్యాలు లేవు. అక్క చెల్లెళ్ళు కూడా అంత దగ్గరగా ఉండరు. అక్క చెల్లెలికి రహస్యాలు చెప్పకపోవచ్చును. చెల్లెలు అక్కకు చెప్పకపోవచ్చును. కాని ప్రాణ స్నేహితురాండ్రు మాత్రం తమ తమ రహస్యాలన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు.

    వెనుక కాలంలో ఆడవారిలో స్నేహితులు అంత సన్నిహితంగా ఉండేవారు కాదట. స్త్రీ తన రహస్యాలన్నీ ఎవరితోనూ చెప్పదనే అంటారు.అందులో నిజం లేకపోలేదు. మా హృదయాంతరాలలో ఉన్న రహస్యాలు సర్వాంతర్యామియైన భగవంతునికే తెలియనియ్యము. కాని చిన్నతనంలో ఈ స్త్రీ విద్యాదినాల్లో నెచ్చెలులకు కాస్త మా రహస్యాలు చెప్పుకుంటున్నాము.

    పురుషులు రహస్యాలు దాచుకోలేరు. ఏ స్నేహితురానితోనో ఎంత నిగూఢ రహస్యాన్నైనా చెప్పేస్తారు. స్త్రీ పురుష సంబంధాలైన రహస్యాలేవన్నా బయటపడ్డాయంటే పురుషుని వల్లనే. అవి సంపూర్ణంగా నమ్ముతాను. ఇంతకూ నాకు ఉండే రహస్యాలేమిటి? నే నేమీ వ్యాపారాలు చేయటంలేదు. ఇంక నాకున్న ప్రణయ కార్యకలాపం అంత నిగూఢమైంది ఏముందిగనకా?