పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముప్ఫైవేలియ్యడం; పెళ్లి ఉత్సవాలకు శాంతాఆప్టే, విశ్వనాథ భాగవతార్, సైగల్ కచ్చేరీలు, బాలసరస్వతి డాన్సు పెట్టించడం, అందుకు తన తోటి వాళ్ళను , పెద్ద ఉద్యోగస్తులను పిలవడం; భోజనాధికాలకు నలభైవేలుఖర్చు చేయడం, ప్రతి పూటా ఆరు పిండివంటలూ, ఎనిమిది కూరలూ, పది పచ్చళ్ళూ, సాంబారు, మజ్జిగపులుసూ, మైసూరు రసమూ చేయించడం, బాటుమాంసాల బియ్యము, రాజనాలూ, డిల్లీభోగాలూ, మాత్రమే ఉపయోగించడం; వచ్చిన అతిధులు తినలేక అజీర్తులతో ఆవేదనపడడం; వీళ్ళందరికీ ప్రత్యేకం ఒక ఎం. బి., బి, ఎస్. నూ, ఒక వైద్యశాలనూ పెళ్లిశాలలో ఏర్పాటుచేయడం; ఊరంతా రొంపి అవడం; దేశ దేశాల లక్షాధికారులు, రాజకీయ నాయకులు , సంఘు నాయకులు, మహాకవులూ పిలవబడటం, కవి పండిత సన్మానం జరపడం, ఒక్కొక్కరికి నూటపదార్లు వగైరాలు ఇవ్వడం, మైసూరు బేండూ, వెంకటరంగమాణిక్యం పిళ్లె సన్నాయి మేళమూ రావడం మొదలైన ఈ పూంజీదారుల అసత్య, హింసాత్మక, దౌర్జన్యపూరిత, గందరగోళాలు పనికిరావంటావు నువ్వు, అంతేనా?

   హేమ : ఎంత  లెక్చరిచ్చావోయ్ బావా!  ఎంత విచిత్రంగా చిత్రించావోయ్ బావా!
   త్యాగతి : ఓ  మరదలా ! ఇంక నీ అభిప్రాయం సాగనీ, నేను  నీ భావాలన్నీ  సరిగ్గా వ్యాఖ్యానం చేశానా?
   హేమ : నీ వ్యాఖ్యానం అంతా నాకు నచ్చలేదులే!
   త్యాగతి : నీ అభిప్రాయం సాగనీ!
   హేమ : జాతీయవాదులమని బయలుదేరి  ఈ  బిర్లాలు, ఈ అంబాలాల్ సారాబాయిలు, ఈ బజాజులు ఓ గుడికట్టీ, ఓ  పాఠశాల తెరచి, హరిజన నిధికి రెండులక్షలు ఇచ్చీ, వీరిని అంటే  బీదలరక్తం పీల్చేవ్యాపారులను మనం నాశనం చేయాలి.
   త్యాగతి :  నిజం హేమా! పాశ్చాత్య సామ్యవాద దృష్టి ప్రకారం నువ్వన్న మాటలు నిజం.
   హేమా : ప్రాచ్యభావన ప్రకారం నిజంకాదా?
   త్యాగతి : కాదు.
   హేమ : ఏమిటా ప్రాచ్యభావం ?  అప్రాచ్యభావం ?
   త్యాగతి:  మహాత్మాగాంధీగారి అభిప్రాయాలు, రామకృష్ణ పరమహంసగారి అభిప్రాయాలు  తెలుసుకోలేదా?
   హేమ: తొంభై ఏళ్ళ గుడి ముసలమ్మ భావాలు, నూట ముప్ఫై ఏళ్ళ తొక్కుగారి భావాలు నాకక్కరలేదు.
   త్యాగతి : కారల్ మార్క్స్  ఇప్పటిదాకా  బ్రతికివుంటే పదహారేళ్ళ బాలకుమారుడా ? లెనిన్  ఇప్పటిదాకా  బ్రతికివుంటే  పన్నెండేళ్ళ పాలూరే బాలకుడా?
   హేమ : వాళ్ళవి నిత్య సత్యాలు!