పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకేశ్వరి వసంతునిలా, సోఫీ పారిజాతంలా బాగా అభినయించారు. రంగస్థలమూ, అలంకారమూ, దీపాల విధానమూ అన్నీ బాగున్నాయి అని చెప్పాడు.

   హేమ : వారే, వా! అసలు నాటకం అందం చప్పవయ్యా అంటే, అన్నీ బాగానే ఉన్నాయి అంటావేగాని.... 
   త్యాగతి : హేమా ! పాటలు బాగున్నాయి. చిన్ననాటకమైనా పొందికగా నడిచింది. ఈనాటి నాటకాలా?  అవి నాటకాలు కావు. నాటక ప్రదర్శనం అంటే ఎవ్వరికీ శ్రద్దలేదు. రంగస్థల సౌందర్యం అవసరంలేదు. దీపాల గొడవ అక్కరలేదు. అలంకారాలు, ఉచితవేషాలు ఏమీ మనవాళ్ళకెక్కవు. ఇంతవరకూ  మనవాళ్ళ దారిద్ర్యం ముఖ్యకారణం అనుకో.
   హేమ : నువ్వు చెప్పినదంతా బాగానేవుంది బావా! కాని నేను రాసిన నాటక రచన గూర్చి చెప్పవేల? కవిత్వం ఎల్లా ఉంది? పాటలెల్లా ఉన్నాయి? భావాలెల్లా వున్నాయి?
   త్యాగతి : పాటలు బాగున్నాయి. చిన్నదైనా గీతా నాటిక బాగా నడచింది. ప్రాచీన భావాలు పోవాలనీ, పోతున్నాయనీ: మాత్రు భావాలు రావాలనీ, వస్తున్నాయనీ; స్త్త్రీల  బానిసత్వం  పోవాలనీ, స్త్రీ పురుషుల కలయిక స్వాతంత్ర్యేచ్ఛమీద ఆధారపడి  వుండాలనీ నువ్వు  అందంగా , అంటే, రసవంతంగా రచించావు. అది  మంచి కావ్యాల్లో ఒకటి. కాని నీ  భావాలలో  చాలా  నాకు సరిపోవు.
   హేమ : ఏమిటా భావాల కొరత? ఆడది  బానిసగా వుండాలనేగా నీ భావం?     
                                                                                                                           
           
               

త్యాగతి: ఏమిటమ్మా బానిస, బానిసంటావు. ఏమిటా బానిసత్వం?

   హేమ : బానిస కాక మా జీవితం ఏమిటి? తల్లిదండ్రుల ఒద్దికలో  పెరుగుతుంటాము.
   త్యాగతి : కాక స్వేచ్చగా పెరగాలనా?
   హేమ : మాట కడ్డమురాకు. ఇంతట్లో పెళ్ళంటారు. వారు ఏర్పాటు చేసిన ఓ  కుఱ్ఱవెధవనో, ముసలి వెధవనో  పెళ్ళిచేసుకోవాలి. చెప్పిస్తున్న ఏదో చచ్చుచదువూ అంతటితో సమాప్తి.  ఇక  మొగుడు  కుంక  అధికారం ఆనాటినుంఛీ! వాడు గుమాస్తా అయితే ఈవిడ గుమాస్తా! వాడు ఉపాధ్యాయుడైతే, ఈవిడ ఉపాధ్యాయుని! వాడు ఎక్కడికన్నా  తీసుకువెళ్తేవెళ్ళడం లేకపోతే పేడలా పడివుండడం. వాడు చస్తే ఈవిడ వెధవముండ! బోడిగుండూ! ఎవరికీ ఎదురు పోకూడదూ! పొద్దున్నే ఎవరి మొగమూ చూడకూదడూ! తెల్లబట్టలు! నగలులేని మోడు!  వంటముండ, దాసీముండ! బోడిముండ.
   త్యాగతి : అంత కోపమేమిటి?