పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాథమూర్తీ మొదలయినవారు చాలామంది పురుషులు వచ్చినారు. స్త్రీ లోకం ఎక్కడికి వెడుతోం దని కొందరు పురుషులను కొన్నారు. మా బాగా మనందరినీ చెప్పుచ్చుకొట్టినారని కొందరు నవనాగరికులనుకొన్నారు. స్త్రీలలోనూ ఆశ్చర్యము పొందినవారూ, సంతోషంచినవారూ, 'ఏమో' అనుకున్నవారూ, పెదవి విరిచినవారూ ఉన్నారు. కాని ఏది ఏమైనా నాటకాది ప్రదర్శనాలన్నీ చాలా అందంగా జరిగాయని మాత్రం అందరూ ఆనందించారు. మొత్తంమీద హేమ నాటిక అందరినీ ఆలోచనలో ముంచింది. నాటకాన్ని గురించీ, ప్రదర్శనల్ని గురించి పత్రికలన్నీ ప్రశంసించాయి. ఉగాది ఉత్సవం వెళ్ళిన రెండురోజులకు పేపర్లన్నీ తీసుకొని; ఉదయం పదిగంటలకు లోకేశ్వరితో కలసి హేమ త్యాగతి ఇంటికి వచ్చింది. శ్రీనాథమూర్తి తన శిల్పభవనంలో వున్నాడని రంగనాయకమ్మగారు చెప్పగానే, ఇప్పుడే వస్తామని బయలుదేరి ఇద్దరూ మూర్తిబావతో మాట్లాడటానికి శిల్పభవనానికే వెళ్ళారు. శిల్పభవనం అజంతా చిత్రలేఖనంలో కనబడే భవన విధానంగా, అమరావతీ నాగార్జునకొండ శిల్పాలలో దృశ్యమయ్యే భవన విధానంగా నిర్మింపబడి ఉంది.

                                                                                                             20
   ప్రాంగణంలో మధ్య నాలుగుస్థంబాలు అచ్చంగా అజంతా స్తంబాలు, ప్రాంగణ ముఖరూపం అజంతా చైతన్య ప్రాంగణ ముఖంలా వున్నది. వితానము అర్థచంద్రాకృతి,  మధ్య చైత్యభాగానికి ఈవలావల  విహార ప్రాంగణాలు, చైత్యమందిరంలోకి పోవుటతోడనే ఎదుటు చక్కని స్పటికశిలా నిర్మిత బుద్ధివిగ్రహము, త్యాగతి పోతపోసిన పంచలోహాత్మక పద్మంపై ప్రత్యక్ష మవుతుంది. ఆ  పద్మము పాలరాతి పద్మపీఠంమీద వున్నది.  ఆ పీఠానికి ఈవలావల పద్మలతాకారములు, దీపవృక్షాలయిన సేమ్మేలు వున్నవి. వాని ప్రక్క ధూపకరండాలున్నవి. విగ్రహానికి ముందు పీఠాలపై పుష్పకరండాలూ, రజిత జలకలశాలూ వున్నవి. వానికి ముందు చిరుతపులి తోళ్ళు పరచివున్నాయి. చీనాదేశపు విగ్రహాలు, కలశాలూ పీఠికలపై ఈవలావల గోడల పొడుగునా అక్కడక్కడ అమరింపబడివున్నాయి. వానికి ముందు  పూజాకలశాలూ, పూవుల పళ్ళెరాలూ వున్నాయి. ఆ మందిరంలో  వితానమూ అర్థచంద్రాకృతిగానే వున్నది. వితానంమీదలతలూ, కుడ్యాలూ అన్నిటిమీదా బుద్ధజీవితగాధలూ మనోహరంగా చిత్రితమై  వున్నాయి. పైన వితానంపై నాలుగు  కాంతాయనాలు నీలివర్ణపు గ్లాసు  ఫలకాలలో  పొదిగింపబడి వున్నాయి. విగ్రహానికి ముందున్న మందిర భాగమంతా ఆక్రమించే బందరు జాతీయకళాశాల పెద్ద రత్నకంబళి పరచి వున్నది.