పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని ఆమెచే చెప్పించి, శ్రీనాథమూర్తి తన మరదలికి శిల్పచిత్రలేఖనవిద్య ప్రారంభించాడు. ఆ రోజుననే ఆంధ్రమహిళాసభలో సభ్యురాలై గౌరవ ఉపాధ్యాయినిగా చేరింది హేమ. హేమను వారందరూ కలిసి వారంరోజులలో సహాయకార్యదర్సినిగా ఎన్నుకొన్నారు. హేమ ప్రసిద్ద చిత్రకారిణి, ఉత్తమ గాయకురాలు; ఫిడేలుపై మధుర గాంధర్వము ప్రవహింపచేయు శ్రీమతి కమలాదేవిగారితో స్నేహం ప్రారంభించింది.


కమల: కళోపానసకన్న ఉత్తమజీవితం ఏముంటుంది హేమసుందరీదేవీ !

   హేమ : లోకం మాడిపోతూ ఉంటే, కళ అని కూర్చుంటే ఏమి ప్రయోజనం ? రోము తగులబడిపోతూ ఉంటే, నీరో చెక్రవర్తిలై రువీణపై  ప్రళయాగ్ని తాండవగీతం వాయించడం ప్రారంభించాడట.
   కమ: లోకంలో  బాధలు  లేకుండా ఎప్పుడుంటాయి! లోకం జీవించి ఉన్నది. కాబట్టి, క్షణక్షణం మార్పు పొందుతూ ఉంటుంది. ఆ  మార్పులో  ఆవేదన  మిళితమై  ఉంటుంది.  ఆవేదన కళకు ఉద్దీపన కావాలి కాని, కళా  జీవితాన్ని చంపేసేటట్లయితే, లోకంలో  కళలు ఉద్భవించకుండా ఉందును కాదటమ్మా?   
   హేమ: అది కాదమ్మా అక్కా! మనుష్యులందరూ ఉత్తమ జీవితాన్ని  ఆశిస్తారు.  కళాజీవితమే ఉత్తమమయితే,  అందరూ ఆ కళాజీవితాన్ని ఆశిస్తారుగదా! అప్పుడు మానవజీవితం ఏమైపోవాలి?
   కమ: అందరూ కళాజీవితాన్ని ఆశించేమాట నిజం,  కాని అది అందరికీ  లభ్యంకాదు. పూర్వజన్మ  సుకృతంవల్ల ఆ కళాశక్తి కొంతమందికే లభిస్తుంది. నేనెన్ని తంటాలైనా పడుతున్నాను.  నాకా కళాశక్తి దూర దూరాన్నే ఉంటూ ఉంది.
   హేమ: మీ నమ్రత అలా ఉంచండి, మీరు గానంలోను, చిత్రలేఖనంలోను నిపుణులు. కాని పూర్వజన్మ సుకృతం ఏమిటి?  పూర్వజన్మం ఉందనీ, అక్కడి సుకృత  దుష్కృతాలు  ఈ  జన్మకీ వస్తూ వుంటాయనీ ఎలా నమ్మడం? ఈ నమ్మకానికి శాస్త్రాధారం ఏది?
   కమ: ఈలోకంలో  మనం  నమ్మే  అనేక  విషయాలకు  శాస్త్రాధారం ఏది? అయినా  వానిని  సత్యాలుగా మనం  నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము.
   హేమ: ఏవని?
   కమ: ఇప్పుడు మీకూ నాకూ స్నేహం కలిసింది. ఆ స్నేహానికి శాస్త్రాధారం ఉందా?
   హేమ: నేను మీ సంఘంలో చేరానుకనుక మీకూ, నాకూ  స్నేహం అయింది.
   కమ: చేరితే ఏమి?  నాబోటి సభ్యురాండ్రు యాభై మంది ఉన్నారు. వారందరితో కూడా ఎందుకు  స్నేహం కాలేదు?
   హేమ: మీరు కళామూర్తులు  కాబట్టి, మీకూ నాకూ స్నేహం  కుదిరింది.