పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎవరో కొందరు స్త్రీలు భారతదేశంలో కూడా దారి చూపించాలి. సరోజినీదేవి బిడ్డలను కనికని విసుగెత్తి, ఆ పనిమానీ దేశ సేవకు దిగింది. కమలాచటోపాధ్యాయుని ఒక కొడుకును కంది. భర్తతో ఏమి సౌఖ్యము అనుభవించింది? పెళ్లి రద్దు చేసుకొని, ఆవిడ ఆవిడ దేశ సేవకు దిగింది. దుర్గాబాయమ్మ మొదటినుంచీ బిడ్డల గొడవ పెట్టుకోలేదు. తల్లిగా వుంటే దేశ సేవ చేయలేము. భార్యగా ఉంటే ఎంత తెలివైన స్త్రీ అయినా, భర్తకు బానిస కావాలి. అంటే తన ఉద్దేశం, స్త్రీ పదహారణాలు భార్య కావాలని ఎనిమిదణాలు దేశ సేవకాని, సంఘసేవ కాని, కళాసేవ కానిచేస్తూ తక్కిన ఎనిమిదణాలు భార్యగా వుండవచ్చునా? రెండూ కుదరవు! పోనీ స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకం పని చేస్తూ, లోకకళ్యాణంకోసం పాటుపడరాదా అంటే హుళక్కి! తాను పెరల్ బక్, మదాంక్యూరీ, బ్రీటీస్ రైటు మొదలగు వాళ్ళ కథలు వినలేదా?

       పోనీ రష్యాలో ఆడవాళ్ళస్థితి చాలా బాగుంది కాదా? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో ఉండి తమ  సోవియట్ రాజ్యానికి  సేవచేయటం  లేదా  అంటే ! అసలు  పెళ్లి ఎందుకు! ఆడదానికి  ప్రథమ కర్తవ్యం ఉద్యోగ వృత్తి? వృత్తి సమస్య పరిష్కారం అయితే  ఆ  వెనుక  వివాహం సంగతి  చూడవచ్చును! పెద్దరికం  స్త్రీకి  వివాహం  ప్రతిబందకమే! ఉత్తమ పురుషులకది ప్రతిబందకము కానప్పుడు ఉత్తమ స్త్రీలకది ప్రతిబంధకమౌతుందా?  ఉత్తమ పురుషులకూ  ప్రతిబంధకం కాలేదా? దాన్టీ, షేక్సుపియరు, గోథీ ముగ్గురూ మేరుపర్వతాలలాంటి  పాశ్చాత్య సాహిత్యవేత్తల వివాహ జీవితం  ఏమయినది? అలాగే నెపోలియన్, జూలియస్ సీజరు, అలెగ్జాండర్ మొదలైనవారి వివాహజీవితం యేమంత చక్కనైనది? ప్రస్తుతం తనకు  వివాహం  గొడవ  అక్కరలేదు. బావగారిదగ్గర  అన్ని కళలూ నేర్చుకోవాలి. సంఘ సేవకోసం మహిళా సభలో చేరాలి.  ఆ తర్వాత  చూచుకోవచ్చును. అయినా ఒకసారి  తీర్థమిత్రునితో కలిసి  నిదానంగా ఆలోచించాలి. ఈలాంటి ఆలోచనలు  ఒకదాని వెనుక  ఒకటి  తరుముకురాగా నెమ్మది నెమ్మదిగా  హేమసుందరిని నిదుర కూరింది.
                                                                                                                  14
   హేమ  మంచి  ముహూర్తం తండ్రిగారిచేత పెట్టించుకొని, త్యాగతికి  శిష్యరికం ప్రారంభించింది. విఘ్నేశ్వర  పూజాదికాలు అయిన  వెనక,
                                                      గురుర్బ్రహ్మా  గురుర్విష్ణుః
                                                       గురుర్దేవో  మహేశ్వరః
                                                       గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
                                                       తస్మై శ్రీ గురవే నమః