పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వినా: కైలాసేశ్వరుడికి!

   శ్రీనాథ: ఓహో  నేను పారిపోవాలి బాబూ!  ఈ బాలిక  లందరూ నన్ను  పంచుకుతింటారు కాబోలు.
   వినాయకరావుగారు పకపక నవ్వారు. అందరూ నవ్వారు. ఈ  రెండు మూడు రోజుల  నుంచీ తండ్రిగారెంతో  సంతోషంతో వుండడం  హేమ చూచింది.  అసలు ఏడాది క్రిందట  త్యాగతి వచ్చినప్పటినుంచీ, తలిదండ్రులలో మార్పురావడం కని పెట్టింది. కొంచెం చిరునవ్వు నవ్వడం;   కాస్త ప్రపంచం అంటే ఏమిటో చూడటము; ఒకటీ, రెండు తెలుగు సినిమాలకు రావడం ఇవన్నీ  కాలాన్ని బట్టి వచ్చిన  మార్పులనుకుంది. తన తలిదండ్రులిద్దరూ తన బావను ఎంత ప్రేమించేవారో!  తన అక్కనూ, అక్కలో  సగం జీవితమైన బావనూ అమ్మా, నాన్న అద్భుతంగా ప్రేమించి ఉంటారు. లేకపోతే, ఈ చక్కని మార్పు వచ్చి  ఉండదు అని హేమ ఆలోచనలో పడింది.
   వినాయకరావుగారు భోజనం చేయగానే కాసేపు పడుకుంటారు. ఆయన లేచి తన గదిలోకి వెళ్ళారు. త్యాగతికి మేడమీద ఒక గదిలో  పక్కవేసినారు. దానికి  చుట్టాలగది అని హేమ పేరు పెట్టింది. ఆ గదిలో  విశ్రమించడానికి త్యాగతి వెళ్ళి అక్కడి  మెత్తటిపరుపు, తెల్లని దుప్పటి పరచి ఉన్న మంచంమీద  మేను వాల్చాడు. రాత్రి  హేమా, తానూ, లోకేశ్వరి  తెల్లవారగట్ల నాలుగింటివరకూ మాటలాడుకుంటూనే ఉన్నారు. తన దేసాటనంలోని వింతల్నీ, విచిత్రాల్నీ  గురించి వారిద్దరూ ప్రశ్నలువేయడం,  తాను చెప్పడం అలా ఎంతో  ఆనందంగా  వెళ్ళిపోయింది. ఏదో జరుగుతుందని  ఆలోచించి, ఏడాదిపాటు పాండవాజ్ఞాతవాసం చేస్తే, ఉత్తర అభిమన్యకుమారుణ్ణి ఉద్వాహం అవుతుందా? లేక  నీ దారిని  నువ్వు  పోవయ్యా అని పంపించి వేస్తుందా? ఏమో అంతా భవిష్యద్గర్భంలో ఉంది. మనుష్యుడు  ఉత్తరక్షనంలో ఇది చేస్తాడని మనం చెప్పగలమా?  అతని మనస్సు  మనస్తత్వశాస్త్రానికి కూడా అతీతము. తన మనస్సు తానెఱుగలేనివాడు ఇతరులను గురించి ఏమి చెప్పగలడు? కొంచెం మెచ్చుతగ్గునా  చెప్పగలమేమో మనస్సుపోకడలు!  ఆ పని  జరిగితే  జరగవచ్చును, లేకపోతే  లేక పోవచ్చును అనగలం.
   హేమ తిన్నగా  తన గదికి వెళ్ళింది. మంచంమీద వాలింది. ఫ్యాను మీట నొక్కింది, పడుకొని కళ్ళుమూసుకొంది.  తాను అలా అనేక విదాలుగా సంచరిస్తోందేమి? తనది వట్టి చంచలహృదయమా?  ఒక మాటు బావ మీద కోపం. ఒకమాటు ఏదో వర్ణించరాని ఆపేక్ష. ఒకమాటు తానుచేసే పని సరియైనది అని అనుకోవడము, ఇంకోసారి అంతా అసంతృప్తే!  ఒకసారి ఇంట్లో వుండ బుద్దివుండదు.  ఇంతట్లోకే ఇంట్లోనే  ఏవో తీయని  కలలుకంటూ నిదురపోవ కోర్కె!  స్త్రీలు బిడ్డలుకనే యంత్ర్రాలా?  ఆడది వంట చేసి పెట్టే ఇక్మీ కుక్కరా? పనిచేసే దాసీదా?  పురుషుని కామతృప్తి తీర్చే భోగినా?