పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగతి: అందుచే మానవ జాతి కంతకూ ఒక్కసారిగా పోటేషియం సైనైడ్ ఇస్తారా?

   తీర్థ: పుట్టకుండా వుండడం మేము కోరతాముగాని, చావెందుకు కోరాలి?
   త్యాగతి: అవును. చావును వేరే కోరటమెందుకు?  పుట్టుకను మానిపిస్తే చాలు.
   హేమ: మా  తీర్థమిత్రుడికి కోపం  వస్తోంది బావా! అతను భోజనానికి కూడా పోవాలి.
   
                                                                                                                  13
   భోజనాలైన వెనుక హేమా,  శ్రీనాథమూర్తీ, వినాయకరావుగారూ, లోకేశ్వరి లోపలి హాలులో కూర్చుండి, తాంబూలాలు  వేసుకుంటున్నారు.
   హేమ బావగారిని చూచి,   బావా, నాకు నువ్వు ముహూర్తం చూచి  శిల్పమూ, చిత్రలేఖనమూ ప్రారంభించు. నేను నీ శిల్పశాలకు రమ్మంటే  అక్కడకు వస్తాను; ఇక్కడకు నీవు రాగలిగితే ఇక్కడకు వచ్చినా సరే  నన్నది.
   వినాయకరావుగారు: అమ్మడూ, నువ్వు బావ దగ్గరకు వెళ్ళే నేర్చుకోవడం ఉత్తమం కాదటే! అక్కడ పుస్తకాలుంటాయి, బావవేసిన బొమ్మలూ,  తయారు చేసిన విగ్రహాలూ వుంటాయి. అవి కాకుండా  అతడు  సమకూర్చుకొన్న  అందమైన  విగ్రహాలూ, చిత్రలేఖనాలూ  అన్నీ వున్నవి.
   హేమ: నాన్నా ! నేను కూడా  విగ్రహాలూ,  చిత్రలేఖనాలు సమకూర్చుకోవద్దూ?
   వినా: అట్లాగే తల్లీ! నేనెప్పుడన్నా వద్దంటానా?
   లోకేశ్వరి: వివిధ దేశాల  వాద్యాలదారులూ  సమకూర్చుకోవాలి.
   శ్రీనాథ: శిల్పరూపంలో ఉన్న వస్తువులు,  శాసనాలు, నాణేలు, తాటియాకు పుస్తకాలు,  అన్నీ చేర్చుకోవాలి. ఆ కళ్ళతో  చూడడం ప్రారంభిస్తే  మనకు నిజమైన  కళాస్వరూపంకల వస్తువులు కనబడుతాయి.
   లోకే: త్యాగాతిగారూ!  నేనూ మిమ్మల్ని  బావగారనడం ప్రారంభించవచ్చునా?
   శ్రీనాథ:  అదేమిటమ్మా లోకం?  బావగారు  అని  అతి గౌరవం చేయాలా? చాల్లే! అల్లా  అయితే  నేను  పలకనే పలకను,  బావా అంటే చాలు.
   హేమ:  లోకానికి మా బాగా చెప్పావు బావా!
   లోకే : కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎలాగైతేనేం నీకు ఓ బావ దొరికాడు, అస్తమానం బావా గీవా  అంటూ కూర్చుంటానికి.                                                                                                                           
           
               

హేమ : ఆ కొబ్బరికాయలో సగం ముక్కను నువ్వు పుచ్చుకో! వట్టి కురిడీకాయ, నేనొక్కదాన్నీ నమలలేను బాబూ!

   వినా: ఇద్దరూ తినేస్తే ఏమి బాగుంటుందర్రా. నలుగురికీ దేవుడి ప్రసాదం పంచాలిగాని.
   హేమ : బావ  ఏ  దేవుడికి  నైవేద్యం  ఇవ్చిన  కొబ్బరికాయమ్మా?