పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గారి పని పట్టేరేమిటి? ఆయన బక్కవాడు, సున్నితమైన హృదయం కలవాడు. నేను బండవాణ్ణి. నా పైన సాగించండి మీ ' బ్లిట్జు ' అన్నాడు.

   హేమ: సరే కాసుకో బావా!
   త్యాగతి: ఇప్పటికి  నువ్వు  బావా  అని పిలవడం  యిరవైయ్యో సారి.
   హేమ:  నువ్వు ఇవాళే నీ ఉద్యోగంలో  చేరుతున్నావు కాబట్టి నిన్ను కొంచెం మభ్య పెట్టడానికి  మొదటిరోజున జీతం  ఎక్కువ ఇవ్వదలచుకొన్నాం.
   త్యాగతి: నువ్వు రోజువారీ జీతం  ఇవ్వదలచుకొన్నావా?
   హేమ: నెలవారి జీతమే కాని  రోజువారీ బహుమతి!
   త్యాగతి: పేకబెత్తం  బహుమతి మాత్రం చేయకు, ఆటల్లో జాజి పూవులు ఇస్తూ వుండు.
   తీర్థ:  ఆ  పువ్వులన్నీ గుండెదగ్గర  జేబులో  వుంచుకొని త్యాగతిగారు  నిట్టూర్పులు విడుస్తూ ఆనందం  పొందుతూ  ఆకాశమంటుతారు.
   త్యాగతి : పూలవాసన  చూసి  పొంగిపోయానే!
             గుండెకాడెట్టుకొని  మండిపోయానే!
   తీర్థ: మండిపోవడం ఏం కర్మమయ్యా!
   త్యాగతి: విరహతాపం ఎక్కువై!
   లోకే: మేమంతా అరటి ఆకులు, పచ్చకర్పూరం, మంచుగడ్డగా వేసిన మంచిగంధం, వట్టివేళ్ళ తడికలు  జాగ్రత్త చేయాలా?
   త్యాగతి : అవి నా విరహాగ్నికి  వీవనలవుతాయి.
   కల్పమూర్తి : ఏమిటో, మీరు మాట్లాడే భాష నాకు ఏమీ అర్ధం కావటంలేదు.
   త్యాగతి : మేం మాట్లాడేది తెలుగుభాష. అందులో శిష్టవ్యావహారికం కూడా.
   తీర్థ : శిష్టమో, కిష్టమో, ఈలాంటి వ్యావహారిక  భాషలన్నీ  వచ్చి  స్వస్చమైన  తెలుగుభాషను రొంపిలో ఊరతొక్కుతున్నాయి.
   త్యాగతి: ఆ  రొంపి, కస్తూరి పన్నీరు కలవడంవల్ల కలిగిన  రొంపి. అవును. తీర్థమిత్రుడుగారు  పేపర్లకు  ఎప్పుడయినా  వ్యాసాలు  రాస్తే,  శుద్ద వ్యాకరణ యుక్తంగా రాసి  రొంపులు, బురదలు తగలకుండా  పొడిగా  ఉండే సహారా ఎడారి ఇసుకలో జాగ్రత్త  చేస్తున్నారు.
   తీర్థ : రొంపికన్న ఇసుక  నయంకాదా అండీ!
   త్యాగతి: ఇసుక, బూడిద, బుగ్గి చాలా మంచివి. బురదలో, రొంపిలో కమలాలు, కలువలూ పుడుతూ వుంటాయి.
   తీర్థ:  నత్తలూ, పురుగులూ, దోమలుకూడా పుడతాయి.
   త్యాగతి: సృజనశక్తి అంటూ  వున్న వాటిలో ఏవైన పుట్టవచ్చును. మృత్యురూపమైన ఇసుకలో, బుగ్గిలో పుట్టుకేది? నిత్యమరణమే.
   తీర్థ: లుకలుకలాడే నీచ ప్రాణులు పుట్టడంకన్న, పుట్టకుండా వుండడం  వుత్తమం కాదా?