పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12

   "ఎందుకే హేమా!"  అని  ప్రతివచన మిస్తూ లోకం  తనగది  వీడి వచ్చింది; హేమాన్ని చూచి, లోకేశ్వరి ఆనందంలో  వుప్పొంగిపోయింది.  ఈ  అలంకరించుకోవడం  త్యాగతికోసమని  లోకేస్వరికి తెలుసును. వీళ్ళిద్దరూ కలిసి, త్యాగతీ  వాళ్ళు  కూచున్న  హాలులోకి వెళ్ళారు.
   వీళ్ళిద్దరూ వెళ్ళేసరికే త్యాగతి కల్పమూర్తితో  నెమ్మదిగా " ఎనిమిది సంవత్సరాలు  దేశాలన్నీ తిరిగి ,  మా ఊరు చేరుకునేసరికి  మా  మామగారినీ అత్తగారినీ,  హేమనూ చూడాలనీ ఆపజాలని కోర్కె పుట్టింది. వెంటనే ఈ  ఊరు వచ్చి వీరిని కలుసుకున్నాను. హేమను పెళ్ళిచేసుకోవలసిందని వారిద్దరూ కోరారు. గురువు ఆజ్ఞా  అదే! మా చుట్టాలందరూ  కోరిందీ అదే! కాని హేమ హృదయం  తెలుసుకోకుండా ఎలాగు?  బావగారిని  వివాహం  చేసుకోవడము  ధర్మంగా ఎంచి,  హేమ ఒప్పుకోవచ్చును. లేదా,  హేమకు వున్న అత్యంత నవీనాభిప్రాయాలతో నిరాకరించవచ్చును.  అందుకని ఈ నాటకం నడిపాను. ఈ  విషయం  మీ హృదయంలో మాత్రం వుంచుకోండి"  అని చెప్పినాడు. కల్పమూర్తికి ఒక రకమైన  సంతోషము,  ఓర్వలేనితనమూ రెండూ  వెలుగు  నీడలులా  ప్రసరించాయి. లోకేస్వరీ, హేమ సుందరులు  హాలులోనికి రాగానే  త్యాగతీ , కల్పమూర్తీ ఇద్దరూ లేచారు.  తీర్థమిత్రుడు అక్కడ లేడు.  
   హేమ : శ్రీనాథమూర్తిబావా!  మనం కాలక్షేపంకోసం  ఏ  పేకాటో  ఆడుకోవాలనీ, తుక్కునవలలు చదువుకోవాలనీ, బాతాఖానీ వేసుకోవాలనీ, కునుకుపాట్లు పడాలనీ, మొదలయిన  కార్యక్రమం అంతా కట్టివేయదలచుకొన్నాను.  ఈ క్షణంనుంచి  హేమకుసుమసుందరి ఏమవుతుందో చెప్పుకో!  నా పేరు  ఇక్కడనుంచి హేమకాదు  'భీమ'  కాదలచుకొన్నది.  నేనూ  ఓ  అయిదేళ్ళ  ప్రణాళిక  వేశాను__నా  బావదగ్గర  చిత్రలేఖనం,  శిల్పం నేర్చుకొనడం, రుక్మిణీ  అరండేలుగారి కళాక్షేత్రంలో  నాట్యం నేర్చుకొనడం,  ఆంధ్ర  మహిళా సభలోకి  రోజూ వెళ్ళడం,  బాలికలకు చదువు చెప్పడం__జీతం గీతం జాంతానై,  దుర్గాబాయమ్మగారికి  సర్వ విధాలా సహాయం  చేయడం,  మా బావదగ్గర ప్రపంచజ్ఞానం  నేర్చుకోవడం-ఇదీ  నా  పంచవర్ష ప్రణాళిక !
   త్యాగతి ' సెహబాస్ '  అని చప్పట్లు కొట్టాడు. అందరూ పకపక నవ్వారు.
   త్యాగతి: హేమా  ఈ నిశ్చయం  మళ్ళీ మార్చుకోనని  ప్రతిజ్ఞచేస్తావా?
   హేమ:  మా  అక్క స్మృతి సాక్షిగా  ఇదే నా ప్రమాణం బావా!
   కల్పమూర్తి: బావా అనడమే  అలవాటయినట్లు మాట్లాడుతోంది హేమం!
   హేమ : ఏయి అబ్బాయీ! నన్ను  ' హేమం గీమం ' అని పిలవొద్దు.  హేమసుందరి అను.