పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపూర్ణ నగ్నంగానో తన దేహం ఆ పురుషుడు చూడడంలేదని తాను మామూలుగా వున్నట్టు నాటకమాడుతూ, దర్సనం ఇస్త్రుంది. చటుక్కున ఎవరో చూస్తున్నారేమో అన్నట్లు నటించి, కంగారు పడినట్లుగాగాని, ఏమీ ఎరగనట్లుగాగాని సంపూర్ణాచ్చాదితం చేసుకుంటుంది. పరదాలో వుండి తొంగి చూస్తుంది. తనవారు లేనప్పుడు పరదా తీసివేస్తుంది. లోకాన్ని ఆశ్చర్యంలో తిలకించే బిడ్డలా నటిస్తుంది. పెద్దకళ్ళతో ఏమీ ఎరుగని లేడిలా చూస్తుంది. కళ్ళు అరమూతలు మూస్తుంది. నిర్భయంగా వున్నట్లు అభినయించి, మగవారితో మాట్లాడుతుంది మగవాడు తగిలినట్లు వులిక్కిపడుతుంది, తగిలినా ఏమీ ఎరుగనట్టు ఆవులా తన దారిని పోతుంది. స్త్రీ పొగడ్త వాంఛిస్తుంది. మాటలు లేని మెచ్చుకొనుట కుబ్బిపోతుంది. ధూపం కోరుతుంది. చిరుకోరికలతో గవ్వలాడుతుంది. పెద్ద కోర్కెలను రంగూను మోలుమేను పెట్టెలలో పెట్టి, అడుగున దాచుకుంటుంది, మనస్సు పసిఫిక్కు లోతులలో మాత్రం దాచుకుంటుంది. అది గాలికై ఎప్పుడైనా పైకి తొంగిచూస్తే అది ఎవరిదా అని తానే ఆశ్చర్యం వ్యంజనము చేస్తుంది. అబద్దములూ ఆడుతుంది. అవి నిజాలంటుంది. నిజాలని భ్రమింప చేస్తుంది. తానే నమ్ముతుంది, కావని అనుమానపడుతుంది. మెరుపులా జ్వలిస్తుంది. గాలిలా ప్రసరిస్తుంది, చినుకులా అణగి మణగి పోతుంది. చంద్రుడై శాంతి, సూర్యుడై కాంతి, తారయై భ్రాంతి మగవాని జీవిత పథాలలో కమ్మివేస్తుంది.

   త్యాగతి  ఒక నాడనినట్లు స్త్రీ  మాయ, మాత;  స్త్రీ  బాలిక,  ఫ్రౌఢ, అవ్వ;  స్త్రీ  చీకటి, స్త్రీ ఆకాశం;  స్త్రీ అమృతమూ, మరణమూ.
   ఏమిది! తన ఆలోచనలకు అంతులేదని హేమ అనుకొన్నది. "స్నానం  చేసేటప్పుడు సతులకు, నిద్రపోయే  పురుషులకు  ఆలోచన లెక్కువ" యని   త్యాగతి అన్నాడు. అతడే  "స్త్రీ  మొదట  తన్ను ప్రేమించుకుంటుంది. తరువాత పురుషుణ్ణి ప్రేమిస్తుం"దన్నాడు. స్త్రీ తన కాంక్షలను  చంపుకోకలిగినట్టు పురుషుడు చంపుకోలేడట.  స్త్రీ  ధరించడంలో భూమి అన్న  పెద్దల  వాక్యంలో  తప్పులేదని  త్యాగతి  ఒకనాడు  వాదించి తన్ను  ఒప్పించాడు.                                                                                                                           
           
               

స్నానం పూర్తిచేసి, అలంకారపు గదిలోనికి పోయి, ఏదో చీరె చుట్టుకొని తల దువ్వుకొంది. ఇంతకూ తన్ను తాను ప్రేమిస్తోందా? ఇంకెవరినన్నా ప్రేమిస్తోందా? ఆమె చిన్న పట్టులాగు మొదట తొడిగి, తెల్లటి పట్టుపరికిణీ తొడిగి, పైన వుల్లిపొరలాంటి, పాము కుబుసంలాంటి తెల్లని మజ్లిన్ చీర, చక్కని లతలూ, అంచులూ కలదానిని ధరించింది. తెల్ల పట్టుబాడీ తొడిగింది. ఆ పైన తెల్లని బాడీస్ తొడిగింది. అప్పుడే వస్తున్న తెల్లని జాజిపూలు జడపైన ధరించింది. ముత్యాల జూకాలు పెట్టుకుంది. మెళ్ళో రవ్వల అడ్డిగె, ముత్యాల తారహారం ధరించింది. చేతులకు ముత్యాల గాజులు, ముత్యపుటుంగరము పెట్టుకుంది. అలంకారపు గదిలోని నిలువుటద్దాలలో చూచుకొంది. తలుపు తీసుకొని, "లోకం" అని కేకలు వేస్తూ బయటకు వచ్చింది.