పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ దిగుతూనే హల్లో తీర్థ్ ! హల్లో కల్ప్ ! మీ ఇద్దరి మొహాలు వెలిసిల్లినట్లున్నాయే! అవి చూస్తే, మా కోసం విరహతాపం పడుతున్నట్లుందే మీరు? అన్నది. పెద్దకారు డ్రైవరు వచ్చి హేమ కారును గారేజీలోనికి నడుపుకుపోయాడు.

   లోకేశ్వరి మాట్లాడకుండా  తన గదిలోకి వెళ్ళిపోయింది.  హేమ త్యాగతిని చూచి  బావా, నిన్న  రాత్రి  నాకు  మీ  ఇంటిదగ్గర   భోజనమైతే,  ఈ  పగలు  మాఇంటిదగ్గర భోజనం!  మా  సుందరమ్మగారి  వంట  నువ్వు  ఈ  రోజు రుచి  చూడాలి. మీ అమ్మగారికి  సైకిలుమీద  వెళ్ళి....ఉండు   మా  కారును పంపించి  అత్తయ్యగారినే  ఇక్కడకు  రమ్మంటాను అన్నది.
    మా అమ్మ  మాకు  మామూలుగా  కట్టే  టాక్సీ మీద  వస్తోందిలే!  నేనూ, మా అమ్మా  ఈ రోజు  ఇక్కడ   ఉండటానికి  అప్పుడే  నిశ్చయించు  కొన్నాములే!  అని చిరునవ్వు  నవ్వాడు త్యాగతి.
   తీర్తమిత్రునికీ, కల్పమూర్తికీ  వీరిద్దరి  మాటలూ ఏమీ అర్థంకాలేదు.  బావా  ఏమిటి  అని ఇద్దరూ  అనుకున్నారు.
    త్యాగతిని  మీకు మళ్ళీ  ఎరుకపర్చాలి!  ఈయన  మా బావ ! ఇన్నాళ్ళనుంచీ ఏదో దేశాలు  తిరుగుతున్నాడనుకున్న   మా బావ ! శ్రీనాథమూర్తి అన్నది హేమ.
   కల్పమూర్తి: మీ  బావ అంటే  శకుంతల భర్త  శ్రీనాథమూర్తిగారా?
   త్యాగతి:  అవునండీ కల్పమూర్తిగారూ! అని  నెమ్మదిగా  కల్పమూర్తి  చేయి అందుకున్నాడు. అతని మోములో  విషాద రేఖలు  ప్రసన్నత  తాల్చినవి.  అతడు తలవాల్చి   నేను  మా మామగారినీ, అత్తగారినీ  చూడడానికి వచ్చాను. ఏలా వచ్చానో, అలా వెళ్ళిపోదామనుకుంటున్నాను అని  తెలిపినాడు.
   తీర్థమిత్రుడు : మీరు  ఈ ఏడాది  మా కెవరికీ  తెలియకుండా  ప్రచ్ఛన్నంగా  ఉన్నారా?
   త్యాగతి : అవునండి.
   తీర్థ : ఆ  ఉండడంలో మీ  ఉద్దేశం?
   త్యాగతి : అది నా రహస్యంలెండి.
   తీర్థ : మీ  రహస్యమా? ఏమిటా  రహస్యం?  ఏదో  నాటకమో నవలో  అన్నట్లు వున్నది. పదిరోజులు  రహస్యం.  నెలరోజులు,  ఒక్క ఏడాదా!
   త్యాగతి : ఎవరి రహస్యాలు  వారికి  ఉంటాయి కదాండీ. ఒక్క ఏడాదికాదు, జన్మంతా రహస్యంగా  ఉండాలని  ప్రయత్నం చేసినవారులేరా?
   కల్ప :  మా జిల్లాలో  ఒకాయన  సంసారం వదలివెళ్ళి, పదేళ్ళు  దక్షిణాదిని ప్రచ్ఛన్నవేషంగా ఉండి, చివరకు ఇంటికి వచ్చాడు. ఎంత మందో ఆయన కోసం వెదికి, ఏమీ కనిపెట్టలేకపోయారు.
   తీర్థ : అలాంటి చిత్రాలు ఉంటాయి కాబోలు!