పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగతి ట ఏమిటీ చచ్చుపేరు. శర్వరీభూషణ్ చచ్చురకం బెంగాలీ పేరు. ఏడాదినుంచీ వీడి భోగట్టా ఏమీ తెలిసిందికాదు. చిన్న తనంలో వీళ్ళందరినీ బాగా ఎరుగునట. దేశాలన్నీ తిరిగాడట. యూరపు కూడా వెళ్ళాడని అప్పుడప్పుడు తేలింది. వీడు హేమ జీవితరంగంలో ప్రవేశించినప్పటి నుంచీ హేమ చాలా మారిపోయింది. నిన్న త్యాగతిగారి ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ పడుకోవడ మేమిటి? వాడు వట్టి బ్రహ్మచారికదా? ఏదో వుంది. అసలు ఈ రెండు మూడు రోజులూ హేమ ఈ లోకంలో లేదు. తాను వచ్చిన సంగతీ, వెళ్ళిన సంగతీ లెక్కచేయందే! కల్పమూర్తి ఈ రెండు మూడు రోజులూ వాజమ్మలా తెల్లబోయి తిరుగుతున్నాడు.


హేమను పలకరిస్తే ఎక్కడో మనస్సు పెట్టుకొని కట్టె విరిచినట్లు మాట్లాడింది. నిన్న సాయంకాలం ఒక్కర్తే తన ఓపెల్ కారుమీద ఎక్కడికో వెళ్ళిందంటే సోఫీ ఇంటికేమో అనుకున్నాడు తాను. ఇంతలో కల్పమూర్తి కారు అరుస్తూ, గుమ్మం ముందు పోర్చిలో ఆగినట్లు చప్పుడైంది. కల్పమూర్తి లోనికి వచ్చాడు.

    తీర్థం, నువ్వా?
    మూర్తీ! నిన్న సాయంకాలం  ఎక్కడికి  వెళ్ళిందో హేమ తెలుసా?
    ఎక్కడికో  ఒక్కర్తే  వెళ్ళిందంటే, సోఫీ ఇంటికి కాబోలు ననుకొని, రాత్రి ఎనిమిదింటివరకూ  చూచి చక్కాబోయాను.
    త్యాగతిగారింటికి వెళ్ళింది. అక్కడే భోజనమట!
    త్యాగతి హోటలు నుంచేగా కారియరు తెప్పించుకుంటాడు. ఆ భోజనానికి  హేమ వెళ్ళవలసిన  అగత్యం ఏమివచ్చింది  చెప్మా? నాతో లోకేశ్వరి   హేమ ఎక్కడికి వెళ్ళిందో  తనకు తెలియదని చెప్పిందే!
    లోకేశ్వరి నీతో చెప్పిందా?  అయితే వాళ్ళిద్దరినీ  తీసుకువెళ్ళలేదన్నమాట త్యాగతి?
    త్యాగతి  తీసుకు వెళ్ళట మేమిటయ్యా?
    వాళ్ళ  పనిమనిషి  లోకేశ్వరిగారినీ,  హేమగారినీ త్యాగతి వచ్చి రాత్రి  తనింటికి తీసుకువెళ్ళాడని  చెప్పిందేమిటి?
    నాతో  లోకేశ్వరి  నిన్నరాత్రి  ఎనిమిదిన్నర గంటలకు  హేమ తన చిన్న కారుమీద  ఒకర్తే  ఎక్కడికో  వెళ్లిందని చెప్పింది.
    ఈ గొడవంతా ఎందుకూ? ఇద్దరం లోపలిపోయి  కనుక్కుందాం   రా!
   ఈ  మాట  లంటుండగానే,  హేమ కారు చప్పుడైంది. వాళ్ళిద్దరూ  హాలులోంచి గుమ్మం దగ్గరకు  రెండంగుళముల ముందుకు వెళ్లారు.  లోకేశ్వరి  వెనక సీటులో  ఉంది. ముందు కారు నడిపే హేమ ప్రక్క,  త్యాగతి కూర్చుని  ఉన్నాడు. తలుపులు తీసుకొని  హేమా, త్యాగతి ఒక్కసారిగా దిగారు. లోకేశ్వరి తర్వాత  దిగింది.