పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ మాటలన్నీ ఎందుకుగాని బావా! నువ్వు అన్ని దేశాలూ తిరిగావు. మొత్తంమీద నీకు కలిగిన ముఖ్యభావం ఏమిటి?

   వాళ్ళిద్దరూ ఆ కెరటాలు  చూస్తూ కూర్చున్నారు. శాలువ తన చుట్టూ కప్పుకొని  హేమ జరిగి త్యాగతిని ఆనుకొని  కూర్చుంది.
   ఏమిటీ విచిత్రమైన బాలిక! ఈమెకు  జీవితం  అంటే  ఆవగింజంతైనా అర్థమైందా? ఒక మాటు అగ్నిశిఖలా భగ్గుమంటుంది. ఇంకోసారి  అత్తరులా అలుముకుపోతుంది. తాను ఈ బాలికను  వివాహం చేసుకొని  ఆనందం అనుభవించకలడా? ఈ బాలికలోని  చంచలత్వాన్ని నాశనం  చేయగల శక్తితనకు వుందా? ఆమెలో  భక్తీ, ప్రేమా, జీవిత  మహాఝంఝామారుతాన్ని  ఎదుర్కోగలిగే ధీరత్వమూ  ఉద్భవింపచేయగల మగవాడు వేరే ఉన్నాడా? ఎందుకు  వచ్చిందో  ఆమెనోటివెంట ఒంటి చంద్రుని భావం. తానివి అన్నీ వదిలి తిన్నగా  స్వామీజీ దగ్గరకు చేరుకొని, నిజమైన శాంతినిచ్చే తురీయాశ్రమం పుచ్చుకొని, జీవితసత్యాన్ని  అన్వేషించే ప్రయత్నంలో  దీక్ష పూనగూడదా?
    బావా! నీ పూర్వకాలపు మౌనంజబ్బు  మళ్ళీ ప్రవేశించిందా? నేనూ నా చరిత్ర  రాశానులే! అది నువ్వు చదువు.
    అదికాదు  హేమా! నేను మదరాసు వచ్చాను. ఏడాదిపాటు మళ్ళీ  జీవించాను. ఇక్కడ  దారుశిల్పమూ,  దంతశిల్పమూ విన్యసించడం నేర్చుకున్నాను. ఒక్క మాటలో, ఒక్కకనురెప్ప  వాల్పులో  నీ జీవితానికి  అడ్డం వచ్చేపని  ఏమీచేయలేదు. నీ స్నేహితురాండ్రతో, స్నేహితులతో నువ్వు  స్వేచ్ఛానందంతో ఒక్క మధురమైన  ఆటగానే, నీ జీవితం  వెళ్ళబుచ్చుతూ ఉంటే, ఆ ఆనందం  పుడిసిళ్ళ జుర్రుకొన్నాను. నీకు మన చుట్టరికం తెలియజేయకుండా; నీతోనూ, నీ  స్నేహితులతోనూ,  నీ ఈడు  యవ్వనునిలా  స్నేహంచేసి; నాలో ఉబికివచ్చిన  అనుమానాలూ, జీవిత వైముఖ్యమూ నాశనం  చేసుకొని, నా కర్తవ్యం నిర్మలరూపంతో  ప్రత్యక్షం చేసుకొన్నాను. ఇంక నేను  నా కర్మయోగంలో పూర్తిగా  ప్రవేశించాలి. నాకు నువ్వు  అనుజ్ఞ ఇస్తే  మా స్వామీజీ ఆశ్రమం  చేరుకుంటాను.
   హేమ తెల్లబోయింది.  తలతిప్పి  త్యాగతి  ముఖంవైపు ఒక్క నిమిషం  తీక్షణంగా చూచింది.  సరే బావా! నిన్ను మదరాసు వచ్చి  నేను ఉండమనలేదు: తొమ్మిదేళ్ళు మా కెవ్వరికీ కనబడకుండా  దేశాలు తిరగమని నేననలేదు.  నీ ఇష్టమైతే నీ గురువుగారి  ఆశ్రమానికే కాదు, ఉత్తర ధ్రువం వెళ్ళు. మధ్య నాకెందుకు? నేనా నీకు ఆజ్ఞలు ఇచ్చేదాన్ని? ఈ తొమ్మిదేళ్ళూ నా ఆనతిమీదే వున్నావా? అన్నది.
   ఆ  మాటలలోని కోపమూ గ్రహించాడు, ఆమె ఆ కోపపు మాటలలో  కూడా తొణికిసలాడే తేనెలు  హృదయమార గ్రోతులూ త్యాగతి,
    హేమా  నేనేది మాట్లాడినా తప్పు  అర్థంచేసుకుంటావేమి కర్మం?అన్నాడు.