పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తను బావతో కలిసి భోజనముచేయుటా, చేయకపోవుటా? అని హేమ వంటింటిలో రంగనాయకమ్మగారు వేసినపీటపై కూర్చుండి ఆలోచింపసాగినది కూర్చున్న పీటఅంతా అలంకారశిల్పమయము. అలాంటి పీటలక్కడ నాలుగున్నవి. ఆ నాలుగూ ఉత్తమ శిల్పి ఎవరో రచించి ఉన్నాడు. కోళ్ళు మూడంగుళముల ఎత్తే అయినా, అవి వివిధ భంగిమలో ఉన్న ఏనుగులతో నిండి ఉన్నవి. పైబల్లమీద అంతా వెండిలతల నగిషీపని కర్రలోపొదిగించబడి ఉంది.


ఆ పని హేమసుందరి దీక్షతో గమనించడం చూచి, అమ్మాయీ!ఆ పీటలన్నీ మీ బావే స్వయంగా చేశాడు అన్నది.

   ఆ ముక్కలకు  హేమ ఆశ్చర్యం  పొందినది. ఏమిటీ విచిత్రపు  మనిషి, ఇంత  అందమైనపని భోజనపు  పీటలపై  కూడా చేసినాడు! ఈ  ఆలోచన ఆమెకు  త్యాగతిపైన కోపాన్ని తగ్గించింది.
   ఇంత చదువుకొని, తన బావ జీవితాన్ని  తాను అపార్థం  చేసుకునేటంత  హీనురాలయింది. తాను వివాహసంస్థే  పనికిరాదని వాదిస్తూన్న  అతి  నాగరికురాలై, ఏమో ఎందుకో  తన బావపైన ఆగ్రహించడమా? తాను తన బావను పెళ్ళిచేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే లేదు. అంతమాత్రానికి  ఏదో చదువురాని  మొద్దులా, హృదయపథాల మంచు గప్పినదానిలా, చిన్న బిడ్డలా  ఆ  వెక్కి వెక్కి  ఏడవడం ఏమిటి? తన త్యాగతి,  తన శ్రీనాథమూర్తి బావ  మహోత్తమ పురుషుడు.  అలాంటివానితో ఏదో కాస్త  ఆనర్సులో నెగ్గిన కొంచెం  ఎర్రగా బుర్రగా  ఉన్న తాను, దేశసేవ, సారస్వతసేవ, సంఘసేవ, కళాసేవ  చేయలేని  తాను, పిచ్చిమనిషిలా ఏడవడమా? ధైర్యంలేక,  పిరికి అమ్మాయిలా  పారిపోవడానికి  సిద్దం అయితే! ఇదా తనబడాయి?  కల్పమూర్తి దగ్గిర, తీర్థమిత్రునితో, నిశాపతి ఎదుట డాబులు  కొట్టడం  మాత్రం  తనకు తెలుసునా? తనకు మాత్రం  భాగ్యవంతురాలనని ఉన్న  గర్వానికి  లెక్కవుందా?  తన అందానికీ, తన భాగ్యానికీ చేరిన వాళ్ళెక్కడ!  అంకుఠితదీక్షతో సంఘానికి  తన  సర్వస్వము  అర్పించే తన బావ  ఎక్కడ!
   ఆడతనం ఎన్ని రంగులు వేసినా పోదు! ఆడవాళ్ళూ, వారి నరాల జబ్బులూ  ఒకటే! బడాయి లెక్కువ! ఛీ! ఛీ! తనకే  బుద్దివుంటే, వెళ్ళి తన బావ  కాళ్ళమీదపడాలి.  అతను తన్ను పెళ్ళిచేసుకుంటేనే  తన జన్మసార్ధకం  అవుతుంది. ప్రేమా? తానెవరిని ప్రేమిస్తున్నదీ  తనకే తెలియదు. ప్రేమ లేకపోతే  భార్యగా  బావకు  సేవచేయడంకన్న  తనకు  మహోత్తమ భాగ్యం  ఏమున్నది? బావ  ఏమి  చేయమంటే  తానదే  చేస్తుందిగాక!
   హేమ లేచి  అత్తయ్యా! నేను వెళ్ళి  బావను  తీసుకొని వస్తా  అన్నది.
   రంగనాయకమ్మగారు  చిరునవ్వు నవ్వుతూ   వెళ్ళు తల్లీ వెళ్ళు  అంది.
   రంగనాయకమ్మత్త  ఎంత  ఉత్తమురాలు.  ఆ  తల్లి  పుణ్యమే  ఈ బావ!