పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బండి శ్రీనాథమూర్తి ఇంటి దగ్గర ఆపింది. లోపలకు దబదబా వెళ్ళింది. ' అత్తయ్యగారూ!' అని కేక వేసింది.

    ఎవరు? హేమా?  అని త్యాగతి తల్లి వంటింటిలోనుంచి బయటకు వచ్చింది. ఆమె  హృదయం భయంకర  ఝంఝాతాడిత సముద్రంలా అయిపోయింది. ఇదివరకు అత్తయ్యగారూ అన్నమాట  వేరు. ఈనాటి పిలుపు వేరు.
    ఏమండీ అత్తయ్యగారూ, మీరు  త్యాగతికి కూడా  తల్లులట కాదూ?  అని హేమ  పకపక నవ్వింది.
    అవునమ్మా,అవును. మూర్తి బావా, త్యాగతీ ఇద్దరూ నా కొడుకు లేనే తల్లీ! అని   లోని  భయం దాచుకొని,  ఆమె   చిరునవ్వతో  జవాబిచ్చింది.
    ఇన్నాళ్ళు, మీరు కూడా ఈ  రహస్యం  నా  దగ్గర  యెందుకు దాచారు? 
    మావాడు  దాచే  రహస్యం, నేను దాచనక్కరలేదా బంగారు బొమ్మగారూ? 
    మీరూ దొంగలేనా? 
    నేను  దొంగనవబట్టేగా  నా  కొడుకూ దొంగవాడయ్యాడు.
    అది నేను నమ్మను. కొడుకు  దొంగతనాలు  నేర్చుకొంటే, ఆతన్ని రక్షించడానికి తల్లికూడా  ఆ పని  నేర్చుకోక  తప్పిందికాదనుకుంటాను. ఇంతలో  హేమకు  వెనక మధుర  గంభీరములగు త్యాగతి వాక్కులు రేపు  మా మరదలుగారు కొంచెం  తక్కువ  శిక్ష విధించవలసిందని  ఈ  ముఖ్యదోషి ప్రార్థిస్తున్నాడు అని వినబడినవి.
   హేమ చటుక్కున వెనకకు తిరిగింది. శ్రీనాథమూర్తి చేతులు  జోడించి తల వంచి, హాసవదనుడై, కొంచెము దేహము ముందుకు వంచి నిలుచుండి ఉండెను కాని  అతని  చిరునవ్వులో  సీతను అరణ్యాలకు  పంపిన  శ్రీరాముని  దివ్యశోకము వర్తిస్తున్నది.
   హేమ పెదవులలో  నవ్వు  నృత్యము  చేస్తున్నది. కన్నులలో పారిజాత  పుష్పాన్ని నారదుడు రుక్మిణి కిచ్చిన  దృశ్యం  చూస్తున్నా సత్యభామ  కోపము  తాండవము  చేస్తున్నది.
   అతని  హృదయంలో అనుమాన భయమూ, ఆమె  హృదయంలో అభిమాన క్రోధమూ వానవల్లప్పలాడుతున్నవి. వీరిరువురుని  తాపసి  వృద్ద  కౌశికవలె  త్యాగతితల్లి చూస్తున్నది. కొంతవడికి త్యాగతి__
    హేమ, నా తరపునా, మా  అమ్మ  తరపునా మమ్ము క్షమించాలని ప్రార్థిస్తున్నాను. ఈ దోషమంతా  నాది.  కాబట్టి  ముఖ్యక్షంతవ్యుడను నేనే!  అని కొంచెం  విచారం రంగరించిన గంభీర వాక్యాలతో ఆమెను ప్రార్థించాడు.
    బావా! ఎంత బాగుంది  నిన్నిలా పిలవడం! అమ్మయ్యా, అనేశాను. అనడానికి నాకు  చెమటలు పట్టాయి. అంత ప్రసిద్దికెక్కిన త్యాగతీ  శర్వరీభూషణ్ గారు  నాకు బావ  అవడం అనే విషయం నన్ను వణికింది. మా అక్క  లేకపోవడం ఇప్పుడు  నాకర్థమయింది బావా! అని ఆమె  కన్నుల  నీరు  తిరుగ పలికింది. త్యాగతి కన్నులనుంచి వర్షాలు కురియసాగాయి. త్యాగతి