పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

   నాలుగురోజులు  త్యాగతికోసం  చూచింది హేమ. అతడు రాకపోవడం తన  కవమానమనుకొని  మూడో రోజున   అందరిమీదా, చిర్రు, బుర్రుమని  విసుగుమాటలాడింది. త్యాగతి  వట్టి  పిరికివాడని  అనుకుంది. ధైర్యస్థుడే  అయితే  మొదటే తాను  ఫలానా అని  చెప్పి, తన ప్రేమను సంపాదించ  ప్రయత్నించవచ్చుకదా! దానివల్ల  ఏమి నష్టం  వస్తుందో అని ఆలోచించి, తానీ రకంగా అజ్ఞాతవాసం చేశాడు? ఎంత వెదకినా, తనకు మాత్రం  త్యాగతి  చేసిన  పనిలో  అర్థం  కనబడలేదు.
   ఒకవేళ త్యాగతి, ఎవరో  పరాయివాడు అని అనుకొని అతనితో స్నేహం  చేయడంవల్ల, అతనిమీద తనకు ప్రేమ కలుగుతుందని  ఆలోచించి ఉంటాడు. అయితే  తన ప్రేమకోసం ఇంత  అసంద్దర్భానికి దిగటం  కూడా  త్యాగతిలో ఉందికాబోలు. అందుకనే సోఫీ, తీర్ధమిత్రుడు, నిశాపతి, ఇంకా  తన సహాధ్యాయులైన కుఱ్ఱవాళ్ళు కొందరు  త్యాగతి అంటే డాక్టరు  హైడ్, జెకిల్  లాంటివాడు అని అనేవారు. కాని త్యాగతి, తన శ్రీనాథమూర్తి బావ  అంతహీనుడెప్పుడూ కాడు. గాంధీమహాత్ముడు తన జీవిత  చరిత్రలో అన్ని విషయాలు నగ్నంగా చెప్పాడు. అలాగే  మూర్తి బావా  చెప్పాడు. అతని  ఆలోచనలూ, అతని జ్ఞానమూ, అతని కళాశక్తీ, అతని హృదయమూ, ఆత్మా నిర్మలమైనవి. లోకప్రఖ్యాతి సంపాదించిన పుట్టిన  మహాపురుషులలో అతడు ఒకడు. అలాంటి  ఒక ఉత్తమ  పురుషుని  పరోక్షంలో న్యాయవిచారణచేసి, శిక్ష వెయ్యడానికి ఎవరికి  అధికారం ఉంది?
                                                                                                                           
           
               

ఒకవేళ తన్ను ప్రేమించాడనుకున్నా, తనలో తన అక్కగార్ని చూచాడు. తన పోలిక అచ్చంగా తన అక్కపోలికే అవడంచేత తన్నతడు వాంఛించాడు. లేకపోతే తనకై తన్ను ప్రేమించకే ఉండునా? అది మాత్రం నిజమైన ప్రేమ అని ఎలా చెప్పగలం? తన్ను తననుగానే ప్రేమింపని ప్రేమను తాను మాత్రం ఎలా అందుకోగలదు? ఎంతమంది తన్న్జు భార్యగా, స్త్రీగా వాంఛించటంలేదు? అలాంటి సందర్భంలో తన బావలాంటి ఉత్తముడు తన్ను కోరి, ఆ కోర్కె ఫలవంతం చేసుకొనడానికి, ఏ ఆలోచనపైనో ఈ ఏడాదిపాటూ ఈలా, తనకూ, తన స్నేహితులకు మాత్రం మరుగుపడి ఉన్నాడన్న మాత్రంలో అతడంత దోషమేమి చేసినట్లు? అయినా ప్రేమ విషయాల చర్చ ఇప్పుడు తన కవసరమేమి? తనలో ప్రేమభావమే లేదుగదా! ఏదో భయపడి, తనకడకు ఈ నాలుగురోజులూ రావటంలేదు. ఎంత వీరుడైనా స్త్రీలకడ కుక్కపిల్ల అయిపోతాడు మగాడు. తానే వెళ్ళి తన బావను లాక్కురావాలి. ఈ నిశ్చయానికి ఎప్పుడు వచ్చిందో ఆ వెంటనే ఆ సాయంకాలం తన్ను అప్సరసలా కైసేసుకుంది హేమ. తన చిన్నకారులో ఎక్కి తానే స్వయముగా త్యాగరాజనగరం తన బావగారింటికి బయలుదేరింది.