పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అత్త : మూర్తీ, నాకెన్నాళ్ళనుంచో ఉన్న కోర్కెను నువ్వు పాలిస్తావని ఉవ్విళ్ళూరిపోయాను. లాభంలేదేమోనని భయపడుతూ కుళ్ళిపోతున్నాను. మీ మమగార్కీ అదే కోర్కె.

మామ : అవును మూర్తీ! మా హేమ పెద్దదయింది. బి. ఏ. ఆనర్సు పరీక్షకు వెడుతుంది. దానికి నువ్వే మూడుముళ్ళూ వెయ్యాలి. ఈ మా కోర్కె ఊరికే వచ్చింది కాదు మూర్తీ! ఈ విషయం మీ అమ్మగారికి ఇదివరకే చెప్పాము. అక్కగారు మీ స్వామీజీతో ఈ విషయం అంతా చర్చించిందట. అందుకు వారు సంతోషంతో అనుమతి యిచ్చారట. ఈ కోర్కె మావల్ల నువ్వు వినాలని కాబోలు స్వామీజీ ఈ విషయాన్ని గూర్చి నీతో మాట్లాడాను అన్నారట.

నేనేమీ పాలుపోక కూర్చున్నాను.

మామ : హేమ పెద్దదయింది. పెద్దపిల్లలకు సంబంధాలే దొరకటం లేదు. సంబంధాలు దొరుకుతాయి, దొరకవు అన్న ప్రశ్న లేనేలేదు. ఆ రోజుల్లో ఈ ఊరు పారిపోయి వచ్చి హేమ చదువులో పైకి వెళ్ళటం ప్రారంభించిన దగ్గరనుంచీ నీకు దాన్నిచ్చే కోర్కె మా యిద్దరికీ కలిగింది.

అత్త : మొగపిల్లలులేని మాకు నువ్వే కన్నకొడుక్కన్న యెక్కువగా అయ్యావు. ఒకేసారి ఇద్దర్నీ పోగొట్టుకోమంటావా మూర్తీ ?

మామ : నాయనా? నువ్వు రావడంతోటే మొదట భరింపలేని దుఃఖం కలిగింది. కాని ఆ వెంటనే మా శకుంతల బ్రతికి వచ్చినట్లే అయింది. అప్పుడే మీ అతగారు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారో చూడు!

అత్త : నాయనా! నాకు భగవంతుడు ప్రత్యక్షం అయి ఏం కావాలి వరం అంటే ఈ కోర్కె ఒక్కటే నాకు వరం అవుతుంది. నా కింకేమీ వద్దు.

మామ : హేమ పెరుగుతున్నకొద్దీ అచ్చంగా శకుంతల పోలికలన్నీ దానిలో మూడుమూర్తులా ప్రత్యక్షం అయ్యాయి. కాని, అది అవతారమూర్తి. ఇది అల్లరిపిల్ల!

అత్త : హేమకు మేమంటే వెఱ్ఱి ఆపేక్షకాని చెప్పినమాట వినదు. గట్టిగా చెప్పలేం కదా నాయనా! ఈ చదువు చెప్పించాము. ఏం చదువులో!

మామ : అన్నీ ఏవో విచిత్ర పద్ధతులే! వీళ్ళనీ వాళ్ళనీ అందరినీ పోగుచేస్తుంది. సినిమాలంటుంది, టెన్నిసు ఆట అంటుంది, షికారులంటుంది, టీ పార్టీ లంటుంది. ఇదీ ఈనాటివాళ్ళ చదువుల ఫలితం తండ్రీ! నువ్వే మా హృదయంలో హేమకు భర్తవు. మా ఇద్దరి కోర్కె తీర్చుబాబూ!

అప్పటికి ఆప్రియదంపతులు గుక్కతిప్పుకున్నారు. నాకు అనుకోని, ఆలోచింపని అతిక్లిష్టమైన సమస్య ఒకటి తెచ్చి పెట్టారా దంపతులు. స్వామీజీ వరకు ఈ విషయం వెళ్ళిందా? అదేనా ఆయన ముక్కలకు అర్ధం! అచ్చంగా శకుంతల పోలిక! ఓహో! నా శకుంతలే తిరిగి వచ్చిందా! నా దేవతామూర్తి తిరిగి ప్రత్యక్షం అయిందా! అని ఆవేదన పడిపోయాను గదా