పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మా మామగారూ, అత్తగారూ కొల్లిపర నా వలెనే మళ్ళీ చూడలేక మద్రాసులోనే కాపురం పెట్టారట. అక్కడ ఒక మేడ కొనుక్కొని మా మరదలికి చదువు చెప్పిస్తున్నారట. నా శకుంతలవలెనే హేమ సుందరి చాలా తెలివైన బాలిక అనీ, చక్కగా పరీక్షలన్నీ విజయంపొందుతూ, బి. ఏ. ఆనర్సు తెలుగూ, సంస్కృతమూ పరీక్ష ఇవ్వబోతున్నదనీ, పదునాలుగో ఏటే స్కూలు ఫైనలు పరీక్షకు వెళ్ళి గణ్యమైన విజయం పొందిందనీ, ఇంటరు కూడా మొదటి శ్రేణిలో మొదటి కొద్ది మందిలో నెగ్గిందనీ నాకు కొల్లిపరలో తెలిసింది.

   ఇదివరదకా, మా మామగారినీ  అత్తగారినీ చూడలేక  పిరికిపందనై, దక్షినాదియాత్ర చేసినప్పుడు కూడా మదరాసు  తప్పించుకొని తిరిగాను. ఈనాడు  వారి మేడ  చూస్తుంటే మా  మామగారినీ, అత్తగారినీ  చూచి, వారి పాదాలమీద  పడి  నా కంటినీరుతో  అభిషేకం చేసి  పొంగిపొరలి రాబోయే నా దుఃఖానికి  విడుదల ఇద్దామని ఏదో  తీవ్రకాంక్ష పుట్టింది.
   కొల్లిపరలో  డిశంబరు నెలలో  రెండు  వారాలవరకూ ఉన్నాను. శకుంతలా  విద్యాలయం స్థాపించే విధానం అంతా  ప్రణాలికలు తయారుచేస్తూ, శారదానికేతనం వెళ్ళి  లక్ష్మీనారాయణ దంపతులతో సంప్రదిస్తూ  పనిలో  మునిగిపోయాను. మా మేనమామ  కుటుంబంవారు, మా అక్కయ్యల  కుటుంబాలవారూ వెళ్ళిపోయారు. నేనూ, మా అమ్మే  మా ఇంటిలో మకాం. ఆ రోజుల్లో నా శకుంతలాదేవి  విగ్రహం పంచలోహాలతో పోతపోశాను.  శుద్ధ భారతీయ విన్యాసంతో,  లలితాదేవి స్వరూపంతో దివ్యమూర్తిలా శకుంతల రూపం తాల్చింది. ఆమె  మోములో ఆనాడామెను నేను పూజించిన పవిత్ర  ముహుర్తంనాటి  గంభీరహాసము  ప్రత్యక్షం  అయింది. నా శిల్ప జీవితంలో ఆ విగ్రహం  పూర్తి అయిననాడు నేను పొందిన  సంతోషం ఇంకెప్పుడూ పొందలేదు. మర్నాడు  ఆ విగ్రహం చూస్తుంటే  నా మామగారినీ, అత్తగారినీ చూడాలని  భరింపరాని ఆవేదన కలిగింది. వెంటనే  మా అమ్మ  దగ్గరకు వెళ్ళాను. ఆవిడ  ఇది వరకు వారిని రెండు మూడుసార్లు చెన్నపట్నం వెళ్ళి చూచి  వచ్చింది.
    అమ్మా! నేను చెన్నపట్నం వెళ్ళి మామగారినీ, అత్తగారినీ చూడాలని నాకు బుద్దిపుట్టింది.
    తప్పకుండా వెళ్ళు నాన్నా! ఇన్నాళ్ళు నువ్వు వారిని చూడకపోవడం ఏమీ  బాగాలేదు. ఇప్పుడయినా నీకా బుద్ది పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ! వెళ్ళు. నువ్వు దేశాలు తిరిగినప్పుడు  నేను రెండు మూడుసార్లు చెన్నపట్నం  వెళ్ళి వచ్చాను. 
   ఆ మర్నాడే బయలుదేరి  చెన్నపట్నం  వెళ్ళాను. పట్టణంలో  మెయిలు దిగగానే ఏవేవో ఆలోచనలు నన్ను  సుడిగాలిలా  చుట్టివేశాయి. వెళ్ళి  తిన్నగా వుడ్ లాండ్సు హోటలులో  మకాం పెట్టాను.  ఆ రోజు సాయంకాలం ఒక  టాక్సీకి  ఫోనుచేసి, రప్పించుకొని, గుండె మోగిపోతుండగా మా మామగారి  ఇంటికి  బయలుదేరాను. ఆ  దంపతుల