పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరకు భక్తితో పూజిస్తూ ఉండగలనుకదా అని ఏదో ఒక విచిత్రమైన ఆనందంతో నిశ్చలత పొందగలిగాను.

నేను ఇంక ఈ దేశంలో చేయవలసింది అదే. ఘనశృంఖలాబద్దయై తీరని వ్యధతో క్రుంగి ఎముకల ప్రోగు మాత్రంగా ఉన్న నా తల్లికి విముక్తి తెచ్చేటందుకు అఖండ సత్యాగ్రహ తపస్సు చేస్తున్న మహాత్మాగాంధీ గారికి అనుచరుణ్ణయి శకుంతలాదేవి నామస్మరణం చేస్తూ నా జీవయాత్ర ముగించవలసి ఉన్నది. నా దేవి మహాత్ముని జగవదవతారమూర్తి అని భావించుకొని, ఆయన ప్రతిరూపాన్ని తాను ఎప్పుడూ పూజించేది. నా శకుంతలకున్న దేశభక్తి నాకు లేకపోయిందే! నా దేశం కోసం నా కళాభి మానం ఆహుతింప లేకపోయానే ఇంతవరకూ. ఎంత స్వార్థపరుణ్ణయి తిరిగినాను! మీరు కళలు మానవద్దు, దేశభక్తినీ మానవద్దు. మీ కళలతో మీ దేశాన్ని అర్పించలేరా? కళలతో మానవులకూ, దేశానికీ, భగవంతునికీ కూడా పూజ చెయ్యవచ్చు కాదండీ అని శకుంతల ఒకనాడు నాతో అన్న ముక్కలు విద్యుల్లతా రూపంతో నా హృదయంలో ప్రత్యక్షం అయ్యాయి. అంత చిన్నతనంలో ఎంత ధర్మపూరితమైన ఆలోచనలు నా దేవికి!

ఎంతసేపూ ఆ రోజుల్లో, ఆమె దేహాన్నే వాంఛించాను. ఆమె దేహ సౌందర్యమే నా మతికి మత్తు కల్పించేవి. ఆమె నాకోసం ఎన్ని సిగ్గుచేటు పనులన్నా చేసేది. కాని ఎప్పటికప్పుడు అమృతపు చిరునవ్వులు నవ్వుతూ ఇవేమి చిత్రాలండీ! ఇదంతా తప్పుకాదుటండీ? అనేది. ఆమె సంయోగ సుఖం ఒల్లని యోగిని అని కాదుగాని, ఆమె ఆనందం ఏదో ఉత్తమస్థితి నందిన భౌతికానందం. నేను తుచ్ఛ పశుత్వానందం పొందే వాడిని. నా ఆనందంలోని మత్తు ఆమెకు నవ్వు తెప్పించేది. ఆమె దేహం అణువు అణువునా గాఢచుంబన వర్షంతో తడిపివేస్తోంటే ఆ బంగారు దేహం ముడుచుకొని పోయినట్లయ్యేది. ఆ దేహంలో ప్రతి అణువూ సిగ్గుపడేది. ఆమె ముద్దులు అమృత స్పర్శలు. నేనెంత ప్రయత్నించినా ఆమె ముద్దుల వల్ల నేననుభవించిన ఆనందం నా ముద్దులవల్ల పొందలేకపోయేవాడిని. ఆమె కౌగిలింతలో అతి గంభీరమైన పరిమళపు ముంపు ఉండేది. నా సంశ్లేషములలో వట్టి గాఢత మాత్రం ఉండేది.

కాలం వెళ్ళిన కొలది నాలోని పశుత్వం మానవత్వంగా పరిణమిస్తుందని ఆమె అనుకునేది కాబోలు. లలిత హృదయులైన కొందరు స్త్రీలు తమ దైవమైన భర్తలు తమవల్ల ఏలాంటి ఆనందం పొందినా తమకది మహాభాగ్యమనే అనుకుంటారు. నే నెప్పుడైనా నా పశుత్వం వీడి మనుష్యుడనై ఆమెతో చరించినపుడు ఆమె నిజమైన ఆనందంతో పరవశత్వం పొందేది! అలాంటి దేవి నావంటి నిర్భాగ్యునకు ఎందుకు దక్కుతుంది? ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా పశుత్వం హరించింది కాబోలు. శిల్పకళద్వారామూక్షం కావాలని కైలాస పరత్వపాద పవిత్ర ప్రదేశంలో నేను అనుభవించిన మహాయోగం నా శకుంతల సహాయం లేకుండా ఎలా కొనసాగించగలను?