పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

' నాన్నా! ఇప్పటికన్నా నీ యాత్రలు పూర్తి అయ్యాయా! '

' ఏమి చెప్పగలనే, నా జీవితమంతా ఇలా తిరగడమే అవుతుందేమో! నా జన్మ నాకు వృధా అనిపిస్తోంది.'

' అదేమిటిరా? నీకు వచ్చిన పేరు, ప్రతిష్ట ఇంకోరికి ఉందా? ఇంతకన్న ఏమి కావాలిరా? '

' ఎందుకమ్మా పేరు? '

ఇంతలో స్వామీజీ మా దగ్గరకు వచ్చారు. ఆయన మోము ఉదయ కాలారుణ కిరణ స్నాతమైన కైలాస శిఖరంలా మెరిసిపోతున్నది. ఆయన చిరునవ్వుతో లేచి, ప్రణమిల్లిన మా ఇద్దరినీ ఆశీర్వదించి, కూర్చుండమన్నారు, మేము ఇద్దరము కూర్చున్నాము.

స్వామి : మూర్తీ! నీ బ్రహ్మచర్యాశ్రమం పూర్తి అయ్యే రోజులు వచ్చాయి.

మా అమ్మ ఆనందంతో విరిసిన మోముతో స్వామీజీవైపు చూచింది.

నేను మాత్రం వారి మాటలకు ఆశ్చర్యం పొందాను. నాకు నా శకుంతల కాక ఇంకెవరు కావాలి? సుశీలాదేవితో నాకు సంభవించిన ఆ తుచ్ఛ దేహసంబంధం చాలు. నా దేహం కోసం ఏ అందమైన బాలికతో సంబంధం పెట్టుకున్నా, గట్టితనంలేని నా మనస్సు విపరీతమైన వేదన బడి నన్ను నాశనం చేస్తుంది. లేదూ, ఒకవేళ ఆ సంబంధం వివాహ స్వరూపంగా వచ్చినా, ఆ వివాహం నామమాత్ర వివాహమే అవుతుంది.

స్వామి : మూర్తీ! నా మాటలు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు తిన్నగా మీ అమ్మగారితో నీ దేశం వెళ్ళు. అక్కడ శకుంతలాదేవి పేరున నెలకొల్పదలచుకొన్న పాఠశాల విషయం అంతా చక్కని ఏర్పాట్లు చెయ్యాలికదా! అందుకు మీ కొల్లిపర వెళ్ళు. నీ భార్య ధాతువుమీద నువ్వు నిర్మించిన సమాధి దర్శించు. అక్కడ నీకు ఏ విధంగా తోస్తే ఆ రకంగా చేయి.

' చిత్తం స్వామీజీ. '

మేమిద్దరం కొల్లిపర చేరుకున్నాము.

                                                                              19

మా మామగారి మేడ పాడుపడినట్లుగా ఉంది. ఆ వెన్నెట్లో ఏదో పురాతన కట్టడాన్ని చూస్తున్నాను అనుకున్నాను. మేడలో కొన్ని గదులలో తమ సామానంతా దాచుకొని, తక్కిన భాగమంతా ఎవరికో ఊరికే కాపురం ఉండమని మా మామగారిచ్చారట! అక్కడినుండి, నా దేవి స్మృతికై కట్టిన తులసికోట చేరాను. ఈ ప్రదేశాలన్నీ నేనూ, శకుంతలా సంచరించనవే! ఇవన్నీ నాకు పవిత్ర ప్రదేశాలు. శకుంతలా పాదస్పర్శాంకితమైన ఈ పుణ్యదేశం నాకు పూజార్హం. ఇక్కడే ఆమె పేరున ఉత్తమ స్త్రీ విద్యాలయం నెలకొల్పాలి. ఆమెకై ఒక దేవాలయం నిర్మించాలి. ఆ దేవాలయంలో నేను నా జీవయాత్ర ముగిసే