పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచ శిల్పచరిత్రలో ఒక్క అణువుగానైనా నా శిల్పాన్ని అర్పించగలిగితే నాకు ఆవేదన లేకుండా ఉండేది. అందుకనే కాదా అన్ని రసాలలోకి ఉత్తమం శృంగారరసం అన్నారు. లోకకల్యాణంగా, విశ్వశ్రేయంగా కావ్యం, శిల్పం రచించేవారు ద్వంద్వంగా వుండే చేయాలి. స్త్రీ పురుషు లిద్దరూ కలిస్తే సంపూర్ణ మానవత్వం వస్తుంది. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, అర్థనారీశ్వర, వాణీ బ్రహ్మాది భావాలు నాకా రోజుల్లో తరిమి తరిమి వెంటవస్తూండేవి. నా శకుంతల నాతో లేనినాడు నాకీ కర్మంతా ఎదుకు?

   ఈ పెద్ద  ప్రశ్నతోనే  నా  గురుదేవుల్ని చేరుకున్నాను. మా అమ్మ అక్కడ నా కోసం ఎదురు  చూస్తూంది.  నా ప్రయాణం  ఒక్కొక్కటి  అయినప్పుడల్లా మా అమ్మ  ప్రాణాలు స్వామీజీ  పాదాల దగ్గర  ఉంచుకొని  వుంటుంది. ఆవిడ  నా కోసం  ఎంత  బాధపడుతున్నదో.  ఈ  బాధలూ  ధైర్యాలూ వెలుగు నీడల్లా  ప్రతి మనుష్యుని  జీవితంలోనూ వుంటాయి.  మనుష్యుడు  ఈ వెలుగు  నీడల్ని  తానైనా  కల్పించుకుంటాడు,  లేదా  భగవంతుడయినా  కల్పిస్తాడు. 
   కైలాసాశ్రమంలో  నేనూ, మా అమ్మా  ఒక నెలరోజులున్నాము. స్వామీజీ  దగ్గర  వుండి నా  శిల్పరచనా, చిత్రరచనా  సాగిస్తున్నా, నాలోని  ఆవేదన  ఏమీ తగ్గదు.  రాత్రిళ్ళు నిద్రపట్టదు.  నా  హృదయంలో  శాంతిలేదు.  నా  శకుంతల  నన్ను  వీడిన రోజుల్లో నేను పడిన  నరకయాతనకూ, ఈనాటి ఈ బాధకు చాలా  భేదం  వున్నది. ఆనాటిది ఒక కత్తిదెబ్బ వంటిది, బుఱ్ఱచితుకగొట్టే గదాఘాతం వంటిది.  ఒక  రైలు  ప్రమాదం వంటిది. ఆరు నెలలు తిండిలేని  ఆకలి బాధ వంటిది.  చలిలో  బట్టలులేని  బీదవాని  మహాదుఃఖంవంటిది. ఈనాటి బాధో? 
   హరిద్వారంలో  నాలుగు  నెలలుండి  రూరిక్కుగారి శిష్యత్వం చేద్దామని మా అమ్మా, నేనూ పంజాబు రాష్ట్రంలో హిమాలయాలలో  ఉన్నకులూ  చేరుకున్నాము. ఒక బంగాళా  అద్దెకు  తీసుకొని  అక్కడ  మకాంచేసి  రూరిక్కుగారి మహాశిల్ప ఛత్రచ్ఛాయలలో శిల్పమూ, చిత్రలేఖనమూ నిజంగా  నేర్చుకున్నాను. రూరిక్కుగారికి  నా  జీవిత  చరిత్ర  యావత్తు మనవి చేశాను. వారు  తమ  అగ్నియోగాన్ని  నా  కుపదేశించి, వారు  వ్రాసిన  గ్రంథం  ఇచ్చారు.  వత్సా! నీ చరిత్ర  విచిత్రమైనదే! ఏ  మహాశిల్పం సాధించుటకు నువ్వు జన్మించావో అది సాధిస్తావు  అని  ఆశీర్వదించారు. రూరిక్కుగారి చిత్రలేఖనంలో  ప్రాచ్య ప్రతీచీ  సంప్రదాయం  సంశ్లేషజనితమైన  ఒక  మహా సంప్రదాయం ప్రత్యక్ష మవుతుంది. ఎన్నిగంటలో రోజూ వారి  బొమ్మలు  చూస్తుండేవాడిని. ఎంతో ఆనందం కలిగేది. 

తిరిగి 1939 జూలై నెలలో హరిద్వారం కైలాసాశ్రమంచేరి స్వామీజీ దగ్గర దీపావళి వరకు మా అమ్మా, నేనూ వున్నాము. దీపావళి వెళ్ళిన రెండు రోజులకు మా అమ్మ నా దగ్గరకు వచ్చింది.