పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్పెయిను వెళ్ళి మాడ్రిడ్ పట్టణం, అల్హంబ్రా మొదలయిన ప్రదేశాలన్నీ చూచాను.

   1936 ఏప్రిల్ నెలాఖరున పారిస్ పట్టణము  చేరాను. పారిస్ లో  లోవరి  ప్రదర్శనశాలలో రోజులు  గడిపి, మార్సలే, వార్సైల్, రీమ్సు దేవాలయం మొదలయినవి దర్శించాను.
   మే  ఉత్సవాలకు  రష్యా  చేరాను. రష్యా దేశంలో  శిల్పక్షేత్రాలను  చూడడానికి,  నవీన సాహిత్యం,  శిల్పం దర్శించడానికి  పూర్తిగా  ఒక నెలా ఇరవై రెండు  రోజులు  పుచ్చుకున్నది.  
   జూను  నెలాఖరుకు  నార్వేచేరి జూలై  పదవతారీఖువరకు  నార్వే, స్వీడనులు చూచి, ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు, ఐర్లండులు  దర్శించడంలో ఆగస్టు  పూర్తయింది. సెప్టెంబరు మూడవ తారీఖున బెల్జియంలో దిగాను. బెల్జియం, హాలెండు, డెన్మార్కులు చూచేసరికి అక్టోబరు పదిహేనవ  తారీఖు వచ్చింది. మళ్ళీ లండను  మహానగరంపోయి, అక్కడ  అక్టోబరు ఇరవై తారీఖున  ఏర్పాటు చేసిన   నా  చిత్ర లేఖన ప్రదర్శన సమయంలో  వున్నాను. ప్రదర్శన విషయంలో  అనేక  పత్రికలు అనేక రకాలుగా  మెచ్చుకుంటూ వ్రాశాయి.
   1936 డిశంబరు నెలలో మళ్ళీ  నా  దేశం చేరుకున్నాను. దేశాలు తిరగడం ప్రారంభిస్తే, అది  నల్లమందలవాటైపోతుంది. 1937-38 సంవత్సరాలు రెండూ  మా  అమ్మగారితో  భారతదేశ క్షేత్రాలన్నీ దర్శించాను.
   ఇన్ని  దేశాలు  తిరిగినది నన్ను  కర్మవీరుణ్ణి చేసుకొనేందుకే కాదూ? ఏదో నాలో  అసంతృప్తి బయలుదేరింది. ఒక్కొక్క  మహాశిల్పమే దర్శించి  నా  అల్పత్వాన్ని  తలచికొని నిట్టూర్పులు పుచ్చాను. నాలో శిల్పం శక్తి ఎంత? ఏమి  నేను రచించాలి? ఏ  మహాభావ్యం మూర్తించగలను?  యూరపులో  ఈ  ఆవేదనే  అనేక  వెర్రితలలు వేసింది. డాడాయిజము, సర్ రియలిజము, క్యూబిజము, సింబాలిజము, ప్రిమిటిజము ఇలా అని, వారికేమీ తెలియని, స్థిమిత హృదయంకాని స్థాయి చిక్కని ఆరాటంలో అన్ని వైపులకూ శిల్పులూ, చిత్రకారులూ పరుగులిడుతున్నారు. దేశకాల పాత్రలను  పట్టి మార్పులు రావచ్చును. శిల్పంఅంతా ఒకేనది కావాలి. ఆ  నందికొండల్లో ఒకవిధంగా ప్రవహిస్తుంది. బయళ్ళలో  ఇంకోవిధంగా యానం చేస్తుంది. వేసవికాలంలో నీలజలాలతో కృశాంగి అవుతుంది. వానాకాలంలో  మహావేగియై  గట్టులుపొర్లి ప్రవహిస్తుంది,  అంతేకాని  సంవత్సరానికో  కొత్తనది వానచూరుకాల్వలా బయలుదేరదు. అసంతృప్తి, ఆవేదనా కళలలో  సిద్ధిని ప్రసాదించవు. నా దేశం  తిరగటములోనే  నా  జీవియొక్క స్థాయీ భావం ప్రత్యక్షం అయింది. అది దూరదూరాననే! ఆ  స్థాయిని నాకు సన్నిహితం  చేసుకోవడం ఎలాగు? యూరపునుంచి వచ్చినప్పటినుండీ  ఈ  అసంతృప్తి నన్ను  హత్తుకుపోయింది. ఒక చిత్రము పూర్తిగా  రచింపలేను, ఒక శిల్పమూ పూర్తిగా విన్యాసం చేయలేదు.